” కేంద్రం పైసా విదల్చడం లేదు… విభజన చట్టం హామీలు అమలు చేయడం లేదు..” అంటూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. అవసరం వచ్చినప్పుడు అంటే.. ఎన్నికల్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు… మనకేమీ చేయలేదు… బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి అనే వాదన కోసం.. అన్నింటినీ తెరపైకి తెస్తున్నారు. నిజమే కేంద్రం తెలుగు రాష్ట్రాలకు ఏమీ చేయలేదనుకుందాం..! . చేయించుకోవడానికి ఏం చేశారు..? నోరెత్తి ప్రశ్నించే దైర్యం ఉందా..? చట్టం ప్రకారం ఇవ్వాల్సినవి ఇవ్వాల్సిందే అని పార్లమెంట్‌ను స్తంభింపచేసే ధైర్యం ఉందా..? మా ఆదాయం అంతా ఉత్తరాదికి పెడుతున్నారు.. మాది మాకే ఇవ్వాలనే డిమాండ్ వినిపించేంత సత్తా ఉందా..? ఏదీ లేదు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు లేదు..! ప్రభుత్వాలకు లేనప్పుడు ప్రజలకూ ఉండదు. అడగందే అమ్మయినా పెట్టదన్నట్లుగా… మోడీ అడిగినా పెట్టరు.. ఇక అడగకపోతే అసలు పట్టించుకుంటారా..?
ఏమీ ఇవ్వట్లేదు..ఇవ్వట్లేదు అంటారు.. ! ఎప్పుడైనా నిగ్గదీసి అడిగారా..?
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎక్కువగా విభజన హామీలు చర్చకు వచ్చాయి. ఒక రోజు ఐటీఐఆర్.. ఇంకో రోజు కోచ్ ఫ్యాక్టరీ.. మరో రోజు బయ్యారం ఉక్కు పరిశ్రమ… ఇలా … విభజన హామీలతో పాటు కేంద్రం చేయాల్సిన వివిధరకాల సాయాలపైనా చర్చ జరిగింది. తెలంగాణ అధికార పార్టీకి ప్రచార సారధిగా వ్యవహరించి… అంతాతానై చూసుకున్న మంత్రి కేటీఆర్ బీజేపీనే టార్గెట్ చేశారు. తెలంగాణకు ఏమీ చేయని బీజేపీకి ఎందుకు ఓటేయాలని ఆయన ప్రశ్నించారు. ఆయన వాదన ఆయన వరకు నిజమే. కానీ… కేంద్రం నుంచి చట్టబద్ధంగా రావాల్సిన వాటి కోసం కేటీఆర్ ఏం చేశారు..? టీఆర్ఎస్ ఏం చేసింది..?. ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వమూ ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఉండదు. అంతా రాజ్యాంగం ప్రకారం నడవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం చెప్పినట్లుగా చేయవు. వాటి సొంత ఆలోచనలు వాటికి ఉంటాయి. ఈ వెసులుబాటు రాజ్యాంగం కల్పించాలి.. రావాల్సిన నిధులను కూడా కేటాయించారు. ఇతర చట్టాలను కూడా చేశారు. అవన్నీ రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు. దేబిరించి తెచ్చుకోవాల్సినవి కావు. ఇవ్వకపోతే… చట్ట పరంగా ముందుకు వెళ్లి తెచ్చుకునే వెసులుబాటు ఉన్న అవకాశాలు. విభజన చట్టం అనేది పార్లమెంట్లో పాస్ అయిన బిల్లు. ఖచ్చితంగా అమలు చేసి తీరాలి. కేంద్రం అమలు చేయకపోతే.. పోరాడి తెచ్చుకోవాలి. ఆ పోరాటం.. పార్లమెంట్లోనా… న్యాయస్థానంలోనా అన్నది సందర్భాన్ని బట్టి.. ఆయా రాష్ట్రాలే తేల్చుకోవాలి. అప్పుడే వాటి గురించి కేంద్రం ఆలోచిస్తుంది.
పోలవరానికి ఖర్చు చేసిన నిధులూ ..గల్లా పట్టుకుని అడగలేరా..?
ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి.. ఇంకా చెప్పాలంటే.. అక్కడ కనీసం తమ పన్నుల వాటా ఇవ్వకపోయినా అడిగే పరిస్థితి లేదు. ప్లీజ్.. ప్లీజ్ అని బతిమాలితే వారు ఎంత ఇస్తే అంత తీసుకునే మైండ్ సెట్‌కు అక్కడి పాలకులు అలవాటుపడిపోయారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో.. కొన్ని కేంద్ర విద్యా సంస్థలు.. మరికొన్ని విభజన హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి చేసినట్లుగా కనిపించినా.. ఇప్పుడు వాటి ఊసే లేదు. ఇవ్వకపోయినా పర్వాలేదన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కడప స్టీల్ ఫ్యాక్టరీ అవసరం లేదని వైసీపీ ఎంపీ ఒకరు లోక్‌సభలో వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంత దాకా ఎందుకు.. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు. ఏపీ ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతీ రూపాయి రీఎంబర్స్ చేయాలి. కానీ గత ప్రభుత్వం ఖర్చుపెట్టిన నిధులే ఇంత వరకూ పూర్తిస్తాయిలో రీఎంబర్స్ చేయలేదు. అడగడానికి ఏపీ ప్రభుత్వానికి మొహమాటం అడ్డు వస్తున్నట్లుగా ఉంది. అడుగుదామని ఢిల్లీకి పోయి.. వేరే ఏదో అడిగేసి సరి పెడుతున్నారు. ఖర్చు పెట్టిన నిధులే ఇవ్వనప్పుడు.. ఇక అదనపు ప్రయోజనాల సంగతి ఆశించడం అత్యాశే అనుకోవాలి. అసలు అడగనే అడగనప్పుడు… కేంద్రం ఏదో ఇస్తుందని ఆశించడం.. ఇవ్వాలని కోరుకోవడం కూడా అత్యాశే.
ఏడేళ్లలో తెలుగు రాష్ట్రాలకు వచ్చిన ఒక్క కేంద్ర ప్రాజెక్టు ఉందా..!?
కేంద్రం ఎవరికీ ఏమీ ఇవ్వడం లేదా..అంటే.. ఒక్క సారి తల పైకెత్తిచూస్తే.. ఏ ఏ రాష్ట్రాలకు ఎన్నెన్ని ఇచ్చిందో త్రీడీలో కనిపిస్తూ ఉంటాయి. గుజరాత్‌కు బుల్లెట్ రైలు… ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మెట్రో రైళ్లు… వేల కోట్ల నిధులు ఇలా లెక్కలేసుకుంటే తెలుగు రాష్ట్రాల ప్రజల గుండె చెరువు అవుతుంది. ఎందుకంటే.. గత ఏడేళ్ల కాలంలో…. కేంద్రం నుంచి తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన నిరకమైన ప్రాజెక్టు ఒక్కటీ లేదు. కానీ కేంద్రం పెద్దలు వచ్చినప్పుడు… ఏపీకి ఐదు స్మార్ట్ సిటీలు.. పది పారిశ్రామిక కారిడార్లు.. ఇరవై కేంద్ర ప్రాజెక్టులు ఇచ్చామని లెక్కలు వల్లే వెస్తూ ఉంటారు. నిజానికి ఒక్కటంటే ఒక్కటీ అమలులో ఉండదు. చివరికి విభజన చట్టం ప్రకారం.. అమలు చేయాల్సిన వాటికీ దిక్కు ఉండదు. విభజన చట్టం ప్రకారం..తెలుగు రాష్ట్రాల్లో గిరిజన యూనివర్శిటీలను ఏర్పాటు చేయాలి. ఏడేళ్ల నుంచి నాన్చుతోంది. కనీసం ధైర్యంగా అడిగే పరిస్థితి కూడా లేదు. ఇలా చేయడం వల్ల…ప్రభుత్వాలు ఎవర్ని ఇబ్బంది పెడుతున్నాయి. గిరిజన యువతకే అన్యాయం చేస్తున్నాయి. దీనికైనా సిద్ధపడుతున్నాయి కానీ.. న్యాయంగా రావాల్సిన వాటి కోసం పోరాడటం లేదు.
మాటెత్తడానికి భయపడుతున్న ముఖ్యమంత్రులు..!
దేశంలో అత్యధికంగా బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. అతితక్కువగా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ అవి కూడా నోరు తెరవలేనంత పరిస్థితి. రాజకీయాలన్నా ఏదో ఓ లొసుగు చేయాల్సిందే. ఆ లొసుగులు కనిపెట్టడం.. ఇతర పార్టీలకు పెద్ద విషయం కాదు. అదే అధికారంలో ఉన్నపార్టీలకు అయితే.. దర్యాప్తు సంస్థలు చేతుల్లో ఉంటాయి. అదే వారి బలం. ఇప్పుడు… తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నోరెత్తలేకపోతున్నాయంటే… ఆ దర్యాప్తు సంస్థల బూచినే కారణం. అవెక్కడ విరుచుకుపడతాయోనన్న భయంతో .. రాష్ట్ర ప్రయోజనాలను కూడా.. ప్రభుత్వాధినేతలు పక్కన పెట్టేస్తున్నారు. ముఖ్యమంత్రులు భయపడుతున్నారని ప్రత్యేకంగా సాక్ష్యాలు చూపించాల్సిన అవసరం కూడా లేదు. కేసీఆర్ మాట తీరు.. గ్రేటర్ ఎన్నికలకు ముందు ఎలా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో… కంపేర్ చేస్తే.. ఆయన ఎంత రాజీపడిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఏపీ సర్కార్ గురించి ప్రత్యేకంగా విశ్లేషించాల్సిన అవసరం కూడా లేదు. బిల్లును మేం వ్యతిరేకిస్తున్నాం కానీ… అనుకూలంగా ఓటేస్తాం అంటూ.. ఆ పార్టీ ఎంపీ లోక్‌సభలో ఓ బిల్లు సందర్భంగా వ్యాఖ్యానించి.. ఎంత ” పాలసీ దారిద్ర్యం”లో ఉన్నారో స్పష్టంగా తెలిసిపోతూనే ఉంది.
ప్రజలకు అన్యాయం చేస్తోంది ఇక్కడి ప్రభుత్వాలే..!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అన్యాయం చేస్తోంది మోడీ నేతృత్వంలోని కేంద్రం కాదు. పోరాడలేని.. నిస్సహాయస్థితికి చేరిన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు.. విపక్షాలే. ఇవ్వాల్సినవి ఇవ్వకుండా రాష్ట్ర ఆదాయవనరుల్ని నిర్వీర్యం చేస్తున్నా.. మాట్లాడలేని ప్రభుత్వాలే. అప్పుల పాలు చేసి… కేంద్రంపై ఆధారపడే పరిస్థితిని తెప్పిస్తున్నా.. కిమ్మనలేకపోతున్నారు. తమ అశక్తతపై పోరాడకుండా విపక్షాలను కేంద్రం స్టైల్లోనే నియంత్రిస్తున్నారు. తమ చేతుల్లో ఉండే పోలీసు వ్యవస్థను పూర్తిగా రాజకీయానికే వాడుకుంటూ… అందర్నీ నియంత్రిస్తున్నారు. ఇలా చేయడం వల్ల… ప్రజల్లో తమ అసహాయత పెద్దగా చర్చకు రావడ లేదని… ఎవరికీ ఏమీ తెలియడం లేదని వారనుకుంటున్నారేమో కానీ.. తమ రాష్ట్ర ప్రయోజనాలకు తామే తూట్లు పొడుస్తున్నామన్న సంగతి మాత్రం వారికి చాలా స్పష్టంగా తెలుసు. కానీ… మనసా..వాచా .. కర్మణా.. రాష్ట్రానికి.. ప్రజలకు ఎలాంటి ద్రోహం చేయబోమని చెప్పి.. పదవులు చేపట్టినవారు.. ఇప్పుడు.. అదే చేస్తున్నారు. మనసు చంపుకుని.. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా… నోరెత్తలేకపోతున్నారు.
పోరాడితే పోయేది జైలుకేనని భయం..!
పోరాడితే పోయేదేం లేదు.. బానిస సంకెళ్లు తప్ప అనేది ఓ స్ఫూర్తివంతమైన నినాదం. కానీ ఇప్పుడు.. పోరాడితే వచ్చేది సంకెళ్లే అని రాజకీయ పార్టీలు గట్టిగా నమ్ముతున్నాయి. జల్సా సినిమాలో ప్రకాష్ రాజ్, పవన్ కల్యాణ్ క్యారెక్టర్ల మధ్య.. తుపాకీ ఎవరి చేతిలో ఉంటే వారు చెప్పిందే కరెక్ట్ అన్న సీన్ ఉంటుంది. ఇప్పుడు అధికారం ఎవరి చేతుల్లో ఉంటే వారు చెప్పిందే కరెక్టే.. చేసిందే రైట్. లేకపోతే.. వారిపై అధికారాన్ని ఉపయోగించి.. కేసులతో బుల్లెట్లు దింపేస్తారు. అందుకే… పోరాడితే పోయేది బానిస సంకెళ్లు కాదని… నిజమైన సంకెళ్లు వచ్చి పడతాయని అనుకుంటున్నారు. తాము పోరాడినా.. ప్రజలు అండగా నిలుస్తారన్న దైర్యం కూడా ఇప్పుడు.. రాజకీయ నేతలకు లేకుండా పోయింది. అది కూడా.. ఓ కారణం. కులమతాలుగా విడిపోయిన సమాజం… ఆ దిశలోనే తమ చుట్టూ ఓ అభూతకల్పనల ప్రపంచాన్ని నిర్మించుకుంది. దాన్ని ఉపయోగించుకుని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. ప్రజల్ని గాలికొదిలేసి.. సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాలు అట్టడుగుకు దిగిపోతున్నాయి.
అడగందే అమ్మయినా పెట్టదు.. మోడీ కూడా పెట్టరు. అడిగితే పెట్టలేదంటారేమోనని అసలు మోడీ అడగకుండా చూసుకుంటున్నారు. అడగితే ఏమవుతుందోనని తెలుగు రాష్ట్రాల సర్కార్లు.. ఉన్నదానితో సర్దుకుపోతున్నాయి. అంతిమంగా అందరూ బాగుంటారు… రాష్ట్రాలు.. ప్రజలు మాత్రం నష్టపోతున్నారు. దీన్ని గుర్తించకుండా.. కుల, మతాల పేరుతో ఓ మాయా ప్రపంచాన్ని రాజకీయ పార్టీలు సృష్టించి పబ్బం గడిపేసుకుంటున్నాయి.