మిత్రపక్షాలు దూరమౌతున్నాయి, సంప్రదాయ భాగస్వామ్య పక్షమే అవిశ్వాసం అంటోంది, ఇంకోపక్క వివిధ రాష్ట్రాల్లో వ్యతిరేకత వ్యక్తమౌతున్న పరిస్థితి..! ఇంత జరుగుతున్నా భాజపాలో కదలిక ఎందుకు కనిపించడం లేదు..? వాస్తవిక దృక్పథంతో ఎందుకు ఆలోచించడం లేదు..? బడ్జెట్ సమావేశాలు మొదలైన దగ్గర నుంచీ పార్లమెంటు ఉభయ సభలూ సజావుగా జరపలేకపోతున్నా.. చీమ కుట్టినట్టైనా మోడీకి ఎందుకు ఉండటం లేదు..? ఆంధ్రప్రదేశ్ విషయమై రాజకీయ పార్టీల మద్దతు పెరుగుతున్నా… పార్లమెంటు వేదికగా మాట్లాడే ప్రయత్నం మోడీ ఎందుకు చేయడం లేదు..? ఈ పరిస్థితులపై భాజపాకి అంటూ ఒక విజన్ ఉండాలి కదా, అదేంటి..? ఇప్పుడు చాలామందికి అర్థం కాని విషయం ఇదే.
ఏపీ విషయంలో భాజపా ఒకే ఒక్క అభిప్రాయంతో ఉంది. చేయాల్సినవన్నీ చేశాం, ఇవ్వాల్సినవి ఇచ్చేశాం, సొంత రాజకీయ ప్రయోజనాల కోసమే సీఎం చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకి వచ్చారనేది భాజపా నేతల అభిప్రాయం. రాష్ట్రానికి ఇంతవరకూ ఇచ్చిన నిధులనే సరిగా వినియోగించుకోలేకపోతున్నారూ, ఇప్పుడు కొత్తగా నిధుల చర్చేంటి అన్నట్టుగా పీయూష్ గోయల్ అభిప్రాయపడుతున్నారు. ప్యాకేజీ కింద నిధులు ఎలా తీసుకోవాలన్నది ఆంధ్రా నిర్ణయించుకోలేకపోతున్నది అనేది అరుణ్ జైట్లీ తదితరుల అభిప్రాయం. భాజపా పాయింటా ఫ్ వ్యూలో.. ప్రస్తుతం ఏపీ నుంచి వ్యక్తమౌతున్న నిరసన తాత్కాలికం. అంతేకాదు, ఎన్నికల తరువాత ఎవరో ఒకరు భాజపాతో కలిసేందుకు సిద్ధంగా ఉంటారనీ, కాబట్టి ఈ తరుణంలో ఏపీ గురించి మరీ ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నది మోడీ, అమిత్ షా ద్వయం అంచనాగా తెలుస్తోంది.
అయితే, దీంతోపాటు దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల ఐక్యతకు కూడా వేదిక ఏర్పడే పరిస్థితి ఉంది. ఫెడరల్ ఫ్రెంట్ అని కేసీఆర్ అంటున్నారు. కేంద్రంపై అవిశ్వాసం నేపథ్యంలో సీఎం చంద్రబాబు వెంట కూడా ఓ 11 పార్టీలు కలిసి వస్తాయనే అభిప్రాయంతో టీడీపీ వర్గాలున్నాయి. ఈ పరిస్థితిని కూడా మోడీ సర్కారు పట్టించుకోవడం లేనట్టుగానే ఉంది. ప్రాంతీయ పార్టీలు ఎన్ని కలిసినా దేశ రాజకీయాలను శాసించే పరిస్థితి రాదనే అభిప్రాయాన్ని రామ్ మాధవ్ లాంటివాళ్లు వ్యక్తం చేస్తున్నారు. మొన్న త్రిపురలో గెలిచాం, రేపు కర్ణాటకలో గెలిచేస్తాం.. అదే ధీమాతోనే ఉన్నారు. సో.. మొత్తంగా చూసుకుంటే మోడీ సర్కారు అతి విశ్వాసంతో ఉందనేది అర్థమౌతోంది. ఆంధ్రా సమస్యల్ని కేవలం రాజకీయాంశంగానే చూస్తోంది. దేశవ్యాప్తంగా వ్యక్తమౌతున్న వ్యతిరేకత తీవ్రతను కూడా పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేనట్టుగానే కనిపిస్తున్నారు. గుజరాత్ లో భాజపాకి ఓటింగ్ తగ్గింది, ఆంధ్రాలో వ్యతిరేకత పెరుగుతోంది, రాజస్థాన్, యూపీల్లో కూడా పరిస్థితి అలానే ఉంది. వాస్తవ పరిస్థితి ఇంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటే.. మోడీ సాబ్ మొండి వైఖరిలో ఎలాంటి మార్పూ వస్తున్నట్టు కనిపించకపోవడం ఆశ్చర్యకరమే..!