రాష్ట్రం పేరు, నాయకుల పేర్లను పక్కన పెడితే మిగతాదంతా సేం టు సేం స్టోరీ. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేల మద్దతు ఉన్న ఒక బలమైన నాయకుడు. అనుకోని పరిస్థితుల్లో అవకాశం కలిసొచ్చి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన ఒక ఎమ్మెల్యేల బలంలేని బలహీన నాయకుడు. ఎమ్మెల్యేల సపోర్ట్‌తో పాటు స్వతంత్రంగా వ్యవహరించగలిగే సత్తా ఉన్న నాయకుడి చేతిలో రాష్ట్రం ఉంటే ఢిల్లీ గద్దెనెక్కిన వాళ్ళకు అస్సలు నచ్చదు. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని వెన్నెముక లేని నాయకులను హీరోలను చేసి జాతీయ పార్టీలు అని చెప్పబడే చిన్న బుద్ధి ఉన్న పార్టీలు రాష్ట్రాలలో ఉండే ప్రాంతీయ పార్టీలతో గేమ్స్ ఆడాలని అనుకుంటూ ఉంటాయి. ఇందిరాగాంధీ నుంచి ఇప్పటి మోడీ వరకూ ఇలాంటి ప్రయత్నం చేసిన జాతీయ పార్టీ నాయకులు చాలా మందే ఉన్నారు. కానీ ఫైనల్‌గా వాళ్ళు బావుకుంది ఏమీ లేదు. ఇందిరాగాంధీ స్టార్ట్ చేసిన రాజకీయ కుయుక్తులను ఫాలో అయిన సోనియాగాంధీ నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎక్కువ శాతం రాష్ట్రాల్లో ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని నాలుగు సీట్లు అడుక్కునే పరిస్థితుల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ విషయం పక్కన పెట్టినా స్వయానా నరేంద్రమోడీ ఈ గుణపాఠాన్ని రుచిచూసిన వారే.
ఢిల్లీలో కేజ్రీవాల్‌ని ముప్పుతిప్పలు పెట్టాడు మోడీ. కానీ ఢిల్లీ ప్రజలు మాత్రం ఎప్పుడూ కేజ్రీవాల్‌కి అండగానే నిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు పంజాబ్ ఎన్నికలలో కూడా బిజెపి కంటే కేజ్రీవాల్‌నే ముందున్నాడన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అలాగే లోక్ సభ ఎన్నికల్లో తనకు భారీ విజయం కట్టబెట్టిన బిహార్‌లో కూడా నితీష్ కుమార్ చేత ముఖ్యమంత్రిగా నియమింపబడిన జితన్ రామ్ మాంజీ అనే వెన్నెముక లేని నేతను ముందుకునెట్టి గొప్ప పాలిట్రిక్స్ గేమ్ ఆడాలనుకున్నారు మోడీ, అమిత్ షాలు. ఆ గేం కాస్తా బూమరాంగ్ మోడీ, అమిత్ షాల మెడకే చుట్టుకుంది. బిహార్ ఎన్నికలలో బొప్పికట్టేలా చేసింది. చచ్చింది అనుకున్న కాంగ్రెస్ పార్టీకి కూడా అధికార పార్టీల పొత్తులో భాగం దక్కేలా చేసింది. మోడీ, అమిత్ షాలకు తలబొప్పి కట్టడమే కాదు….వాళ్ళిద్దిరినీ నమ్ముకుని ముఖ్యమంత్రిని చేసిన నితీష్ కుమార్‌కి హ్యాండ్ ఇచ్చి పొలిటికల్ గేంకి తెరతీసిన మాంజీకి బిహార్ పొలిటికల్ చిత్రం నుంచి తెరమరుగయ్యేలా చేసింది. మోడీ ప్రత్యర్థి నితీష్ కుమార్‌ని ముఖ్యమంత్రిని చేసింది.
నరేంద్రమోడీ, అమిత్ షాలకు ‘గజిని’లో హీరోలాగా మెమొరీ లాస్ ఉందో ఏమో తెలియదు కానీ బిహార్‌లో ఆడిన సేం గేంని ఇప్పుడు తమిళనాడులో స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా పన్నీరు సెల్వం అనే ఓ ‘మాంజీ’ మోడీ, అమిత్ షాలకు దొరికాడు. ఇప్పుడు తమిళనాడులో మోడీ ఆడుతున్న గేం దెబ్బకు కాంగ్రెస్, బిజెపి పార్టీలు రెండూ కూడా ఒకే గూటి పక్షులని, సోనియా, రాహుల్‌ల రాజకీయాలకు మోడీ, అమిత్ షా రాజకీయాలకు ఏమీ తేడా లేదన్న విమర్శలు వస్తున్నాయి. 2014లో దేశాన్ని అభివృద్ధిలో నడిపించడానికి వచ్చిన దార్శనిక నాయకుడిగా ఎక్కువ శాతం మంది భారతీయులకు కనిపించిన మోడీ….ఇలాంటి రాజకీయ ఆటల వళ్ళే ఇప్పుడు ఫక్తు రాజకీయ నాయకుడిలా కనిపిస్తున్నాడు. కాంగ్రెస్ చేసిన రాజకీయాలకు 2014 నుంచి మోడీ చేస్తున్న రాజకీయ ఆటలకు తేడా ఏమీ లేకుండా పోతోందని రాజకీయ విశ్లేషకులు ఉదాహరణలతో సహా చెప్పేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌లతో సహా దేశంలో ఉన్న చాలా మంది నాయకులకు తాను సుప్రీమ్‌గా ఉండాలని మోడీ భావిస్తున్నట్టున్నాడు. కానీ అలాంటి నియంతృత్వాన్ని కోరుకున్న ఇందిరాగాంధీకి దేశ ప్రజలు, అదే బాటలో నడుస్తున్న నరేంద్రమోడీకి ఢిల్లీ, బిహార్ ప్రజలు నేర్పిన గుణపాఠాన్ని మాత్రం మర్చిపోతున్నాడు. చేతిలో పూర్తి అధికారం ఉంది కదా అని మోడీ, అమిత్ షాలు ఇవే రాజకీయ ఆటలు ఆడితే మాత్రం 2019 ఎన్నికల్లో దేశ ప్రజలందరూ కూడా మోడీకి లెస్సన్ చెప్పడం ఖాయం. మోడీకి పోటీగా రాహుల్ గాంధీ నిలబడలేకపోవచ్చేమో కానీ మోడీ స్థాయిని మించిన వాళ్ళు, ఆయన కంటే అనుభవజ్ఙలు అయిన నితీష్ కుమార్లాంటి నాయకులు దేశంలో ఉన్నారన్న విషయం గుర్తుంచుకుని ఈ పొలిటికల్ గేమ్స్‌కి ఫుల్ స్టాప్ పెట్టి…..కాస్తంత భారతదేశ అభివృద్ధికి ఉపయోగపడే పనులు చేస్తే ఆయనకే మంచిదేమో.