భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మూడేళ్ళ పాలన పూర్తి చేసుకున్నసందర్భంగా ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారా? తీసుకునే అవకాశాలున్నాయా? అంటే అవుననే అనిపిస్తోంది. ఇప్పటిదాకా అవినీతి మీద అస్త్రాలను ఎక్కుబెట్టిన మోడీ తదుపరి లక్ష్యం పార్టీ ఫిరాయింపులుగా కనిపిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలలో ఇలాంటి పనికే పాల్పడిన బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంటుందా అనే సందేహం ఉండవచ్చు. ఎలాగూ అటు ఎన్నికలైపోయాయి కాబట్టి ఇప్పుడాయన తన దృష్టిని దక్షిణావనిమీద పెట్టారనిపిస్తోంది. తమిళనాడులో బలపడడానికి అంచెలంచెల వ్యూహాలను అమలుచేస్తున్నారు. అక్కడ బలపడే అవకాశముంది తప్ప అధికారంలోకి వచ్చే సావకాశం లేదు. అక్కడి ప్రజల మనోభావాలు అలాగే ఉంటాయి. తమమీద ఎవరినీ పెత్తనం చెలాయించనివ్వరు. పైగా మేము తమిళులం అంటారు తప్ప భారతీయులమని చెప్పరు. తమిళులం.. తరవాతే భారతీయులమని గర్వంగా చెప్పుకుంటారు. హిందీ నేతల బలాన్ని అసలు సహించరు. కేరళలో మళ్ళీ 4ఏళ్ళకు చూసుకోవచ్చు. కర్ణాటకలో ఎలాగూ పాగా వేయబోతున్నారని సంకేతాలున్నాయి. ఇక మిగిలినవి తెలుగు రాష్ట్రాలు. ఇటీవలి కాలంలో ప్రజాస్వామ్యం ఈ రెండు రాష్ట్రాలలో అపహాస్యం పాలైనంతగా ఎక్కడా కాలేదు. విచిత్రమైన పరిస్థితి తెలుగు రాష్ట్రాలు చవిచూశాయి. అధికారమే పరమావధిగా.. అధికార పార్టీలో ఉంటే చాలనుకున్నారు. లాభాలు బేరీజు వేసుకున్నారు. చెంగున అధికార పక్షంలోకి దూకేశారు. తెలంగాణలో అయితే టీడీపీ సభ్యులు అసెంబ్లీలో టీడీపీని అధికార పక్షంలో విలీనం చేసేశారు. ఎంపీలలో కూడా విద్యా సంస్థల అధిపతి మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి(వైయస్ఆర్ కాంగ్రెస్), గుత్తా సుఖేందర్ రెడ్డి(కాంగ్రెస్) టీఆర్ఎస్కు వంతపలుకుతున్నారు. ఆంధ్ర ఎంపీలు తక్కువేం తినలేదు.. వైయస్ఆర్ కాంగ్రెస్ టికెట్ మీద నెగ్గిన నంద్యాల ఎంపీ యస్పివై రెడ్డి, అరకు ఎంపీ కొత్తపల్లి గీత కూడా టీడీపీ పంచన చేరారు. ఆంధ్ర ప్రదేశ్లో అయితే ప్రలోభమో.. స్వలాభమో.. బెదిరింపో తెలీదు గానీ వైయస్ఆర్ కాంగ్రెస్ నుంచి 20మందికి పైగా ఎమ్మెల్యేలు పచ్చ కండువా కప్పేసుకున్నారు. ఈ కప్పదాట్లను ఎవరూ హర్షించలేదు. స్పీకర్లకూ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీనికి చెక్ పెట్టడానికి వ్యూహంగా లోక్సభలో పార్టీ ఫిరాయించిన తెలుగు ఎంపీలకు నోటీసులిచ్చి, అనర్హులుగా ప్రకటించేందుకు రంగం సిద్ధమవుతోందని వినికిడి. లోక్ సభలో ఎంపీలను అనర్హులను చేస్తే….. ఈ రెండు అసెంబ్లీల్లోనూ కూడా స్పీకర్లపై ఒత్తిడి పెరిగి చర్య తీసుకోవాల్సిన పరిణామాలు తలెత్తుతాయి.
శాసనము ద్వారా నిర్మితమైన… అంటూ ఎవరికి తోచిన సాక్ష్యాన్ని వారు ఎంపిక చేసుకుని మరీ సొంత పార్టీలను మోసం చేసేసిన ఎమ్మెల్యేల ఆటకట్టించడానికి ఇదో ఆయుధంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ చర్య అందరి మన్ననలూ కూడా పొందుతుంది. తెలుగు రాష్ట్రాలలో బలపడాలని చూస్తున్న బీజేపీ ఇలాంటి చర్య తీసుకుంటే అది ఊహించని ఫలితాలూ, ప్రయోజనాలూ వచ్చి పడతాయి. ప్రాంతీయ పార్టీల వైఖరితో ప్రజలు విసిగిపోయి ఉన్నారు.. ప్రత్యామ్నాయం లేక వారు వాటికి ఓట్లు వేయాల్సి వస్తోంది. ఏరు దాటాక.. సామెత మాదిరిగా అవి వ్యవహరిస్తున్నాయి. అమరావతిలో భూముల సేకరణే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. తెలుగు రాష్ట్రాలలో కాషాయ జెండా రెపరెపలాడించడానికి మోడీకి ఇదే సరైన సమయం.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి