ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘ప్రత్యేకహోదా’ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వమే హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఇంకా ఇవ్వాలా…వద్దా? ఇస్తే ఏమయినా సమస్యలు వస్తాయా? అని కూడికలు, తీసివేతలు వేసుకొంటోంది మోడీ ప్రభుత్వం. ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రానికి కలిగే లాభం కంటే అదివ్వక పోవడం వలన ప్రతిపక్ష పార్టీలకి ఎక్కువ లాభం కలుగుతోంది. ఏవిధంగా అంటే ఇప్పుడు ఈ అంశం అన్ని పార్టీలకి ఒక రాజకీయ అస్త్రంగా చాలా బాగా ఉపయోగపడుతోంది. రాహుల్ గాంధీ మొదలు గల్లీ స్థాయి ప్రతిపక్ష నాయకుడు వరకు అందరూ కూడా చంద్రబాబు, మోడీ ప్రభుత్వాలని విమర్శించాలంటే మొదట దీనితోనే సంకల్పం చెప్పుకొని తిట్లు లంఖించుకోవడం ఒక ఆనవాయితీగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు.
మాజీ ప్రధాని దా. మన్మోహన్ సింగ్ పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్, బీజేపీలు రెండూ కూడా దానికి మద్దతు ఇచ్చి, ఆ హామీకి కట్టుబడి ఉన్నామని చెపుతున్నప్పటికీ, అందరూ దాని గురించే తెగ మాట్లాడుతున్నప్పటికీ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదాకి నోచుకోలేదు. ఇంకా ఎప్పుడు ఇస్తారో…అసలు ఇస్తారో..ఇవ్వరో కూడా ఎవరికీ తెలియదు. కానీ అదేదో మొరటు సామెత చెప్పుకొన్నట్లుగా నిన్న బీహార్ లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోడీ బీహార్ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించేశారు. కానీ దానికీ షరతులు వర్తిస్తాయని తేల్చి చెప్పారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు బీజేపీని గెలిపిస్తే(నే) బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ ప్రకటించారు.
ఇంతకు ముందు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు కూడా అలాగే హామీ ఇచ్చారు. ఆయన మాటలని, ఆయనకి వంతపాడిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుల మాటలను నమ్మి ప్రజలు ఎన్డీయే అభ్యర్ధులకే ఓటేశారు. అయినా ఇంతవరకు ప్రత్యేకహోదా ఇవ్వలేదు. ఏమంటే అది చెప్పినంత వీజీ పనేమీ కాదు…ఆ ప్రయత్నంలోనే ఉన్నాము. 10..20…40…60 శాతం పనులు (?) పూర్తయిపోయాయి…త్వరలోనే మిగలిన శాతాలు కూడా పూర్తయిపోతాయి అంటూ హామీలు గుప్పిస్తున్నారు. కానీ ఆ శాతాలతో బాటే నెలలు…సం.లు కూడా అదే నిష్పత్తిలో గడిచిపోతున్నాయనే సంగతి జనాలకి తెలియదనుకొంటున్నారు.
బహుశః మళ్ళీ వచ్చే ఎన్నికల సమయానికి 99 శాతం పనులు పూర్తి చేసేసి, ఇప్పుడు బీహార్ ప్రజలకి చేపుతున్నట్లే మళ్ళీ తమ పార్టీలకే అధికారం కట్టబెడితే ఈసారి తప్పకుండా మిగిలిన ఆ ఒక్క శాతం పనులు కూడా పూర్తి చేసేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని చెపుతారేమో? ప్రస్తుతం బీహార్ ప్రజల వంతు వచ్చింది కనుక మోడీ దొరగారు వాళ్ళనీ కలుపుకుపోతున్నట్లున్నారు. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. వాళ్ళకీ ప్రత్యేకహోదా ఇచ్చేస్తానంటారేమో…అదీ మంచిదే! ఒక్క రాష్ట్రానికి ఇచ్చి మరొక రాష్ట్రానికి ఇవ్వకపోతే ఎవరో ఒకళ్ళు అభ్యంతరాలు చెప్పవచ్చు. కానీ ఇలాగ అన్ని రాష్ట్రాలకి ప్రత్యేకహోదా ఇచ్చేస్తే లేదా ఇచ్చేస్తామని చెపితే ఇక ఎవరికీ అభ్యంతరం ఉండదు…ఆనక ఇలాగే శాతాలు కూడికలు తీసివేతలు లెక్కలు చెప్పుకొంటూ కాలక్షేపం చేసేయోచ్చు.