ప్రత్యేక హోదా గురించి మాట్లాడుదామంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడూ విదేశాలలోనే ఉంటారని ఎంపీ రాయపాటి సాంభశివరావు ఆరోపించారు. ఎన్నికల ప్రచార సభలలో, విదేశాలలో ప్రవాస భారతీయుల ముందు అనర్గళంగా మాట్లాడే మోడీ లోక్ సభలో ఎందుకు మాట్లాడటం లేదని రాహుల్ గాంధీ ప్రశ్న. ఈ రెండు ఆరోపణలు నిజమేనని నమ్మక తప్పడం లేదు. నెలకొకసారయినా విదేశాలకు వెళ్లి వచ్చే ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళీ ఈనెల 16, 17తేదీలలో యునైటెడ్ అరెబ్ ఎమిరిటీస్ లో పర్యటించబోతున్నారు.
కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలలాగ తన సభలకు జనసమీకరణ చేయనవసరంలేదని నిరూపించేందుకు ఆయన తన సభలకు హాజరవ్వదలిచేవారి కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ల పద్దతిని చాలా కాలం క్రితమే ప్రవేశపెట్టారు. దానిలో రిజిస్ట్రేషన్ చేసుకొన్నవారికి మాత్రమే ఆయన సభలలో హాజరయ్యేందుకు అనుమతిస్తారు. రాజకీయాలలో ఇది ఊహించలేని సరి కొత్త పద్దతే. మోడీ మాటల మాయాజాలం విని ఆనందించేందుకు చాలామంది ఆన్ లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొంటున్నారు. ముఖ్యంగా విదేశాలలో మోడీ సభలకు మంచి డిమాండ్ ఉంది.
ఈనెల 17న దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోడీ సభకు హాజరయ్యే వారి కోసం “నమోయిన్ దుబాయ్@యు.ఏ.ఇ.” అనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్ సైట్ లో ఇంతవరకు మొత్తం 48,000 మంది భారతీయులు ఆన్ లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేయించుకొన్నారు. మిగిలిన నాలుగు రోజుల్లో ఆ సంఖ్య ఇంకా చాలా పెరిగే అవకాశం ఉందని భావించవచ్చును. కానీ స్టేడియం కెపాసిటీ కేవలం ముప్పైవేలు మాత్రమేనని గ్రహించిన అధికారులు, స్టేడియం బయటకూడా డిజిటల్ స్క్రీన్స్ షామియానాలు వగైరా ఏర్పాట్లు చేసి ఇంకా ఆన్ లైన్ బుకింగ్ కొనసాగిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ నిస్సందేహంగా దుబాయ్ లో ప్రవాస భారతీయులను ఆకట్టుకొనే విధంగా అద్భుతమయిన ప్రసంగం చేయగలరని చెప్పవచ్చును. కానీ అంత గొప్పగా మాట్లాడగలిగిన ఆయన లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు అడుగుతున్న ప్రశ్నలకు సభలోనే ఉన్నప్పటికీ జవాబు చెప్పకుండా మౌనంగా కూర్చోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అటువంటి మౌనం మాజీ ప్రధాని స్వర్గీయ నరసింహరావుకి చాల శోభనిచ్చేది. ఎందుకంటే ఆయన మాటలు తక్కువ చేతలు ఎక్కువ అన్నట్లుగా వ్యవహరించేవారు. పైగా తన మౌనం కూడా ఒక నిర్ణయమే…వ్యూహాత్మకమే అని చాలా చక్కటి భాష్యం చెప్పారు. అది ఆయనకే చెల్లు.
కానీ ఏ విషయం గురించయినా తడబడకుండా మాట్లాడగలవాడు, ప్రతిపక్షాల విమర్శలను అంతే ధీటుగా త్రిప్పి కొట్టగల మంచి మాటకారి అయిన నరేంద్ర మోడీ లోక్ సభలో ప్రతిపక్ష సభ్యులు జవాబు చెప్పమని ఎంతగా నిలదీసి అడుగుతున్నా మాట్లాడలేకపోవడమే విచిత్రం.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇమ్మని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణాలు చేసినా ఆయన నోట ఇంతవరకు ఆ ఒక్క ముక్క ఊడిపడలేదు. పోనీ నిలదీసి అడుగుదామా…అంటే ఆయన ఎప్పుడూ ఇలాగ విదేశాలలోనే ఉంటారని రాయపాటి చెప్పిన మాట కూడా నిజమని నిరూపిస్తున్నారు. ఈనెల 15 తరువాత ప్రత్యేక హోదా గురించి చర్చిద్దామని ప్రధాని నరేంద్ర మోడీ తనకు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు చెప్పారు. అప్పుడయినా ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కనీసం ఆయన నోట ఆ ముక్క వినబడితే విని తరించాలని ఆంద్ర ప్రజలు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.