పాకిస్తాన్ ప్రభుత్వం కాశ్మీర్ ప్రస్తావన చేసినప్పుడల్లా ‘అది భారత్ లో అంతర్భాగం దానిని భారత్ నుంచి ఎవరూ విడదీయలేరు’ అంటూ రెడీగా ఉన్న ప్రకటనని భారత్ చదివి వినిపిస్తుంటుంది. గత ఆరు దశాబ్దాలుగా ఇవే డైలాగులు వినపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మోడీ ప్రభుత్వం దానికి అధనంగా ‘పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్ స్వంతమే. దానిని పాకిస్తాన్ తిరిగి భారత్ కి అప్పగించాలి,’ అనే కొత్త డైలాగ్ జోడించింది. కనుక ఇకపై ఈ కొత్త డైలాగ్ తో సహా పాతవి కూడా కలిపి వినవలసి ఉంటుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ స్వంతమే అనే వాదనని ‘డైలాగ్’ అని అంటున్నందుకు చాలా మందికి బాధ, ఆగ్రహం కలిగించవచ్చు. కానీ ఇది మాటలకే పరిమితం తప్ప చేతలలో కనబడదు కనుకనే ‘డైలాగ్’ అనవలసి వచ్చింది తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు.
గత ఆరు దశాబ్దాలుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్ అధీనంలోనే ఉంది. అదేవిధంగా కాశ్మీర్ భారత్ అధీనంలోనే ఉంది. అయినా రెండు దేశాలు వాటిపై తమ హక్కుని వదులుకోమన్నట్లుగా మాట్లాడుతున్నాయి. కానీ ఏనాడు తమ హక్కులని నిరూపించుకొనే ప్రయత్నం చేయలేదు. చేసి ఉంటే మూడో ప్రపంచ యుద్ధం సంభవిస్తుందేమో కూడా..ఆ భయంతోనే అవి ధైర్యం చేయలేకపోతున్నాయి.
యుద్ధోన్మాదంతో రగిలిపోతున్న పాకిస్తాన్ సైనికాధికారులు అందుకు ధైర్యం చేయాలని చాలా తహతహలాడుతున్నప్పటికీ ప్రపంచదేశాలు, ముఖ్యంగా అమెరికా ఒత్తిడి కారణంగా పాకిస్తాన్ తన వద్ద ఉన్న న్యూక్లియర్ బాంబులని భారత్ పైకి గురిపెట్టి కూర్చొని సమయం కోసం ఎదురుచూస్తోంది. కాశ్మీర్ కోసం వాటిని భారత్ పై ప్రయోగించాలని హిజ్బుల్ ముజాహుద్దీన్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ పాకిస్తాన్ ప్రభుత్వానికి ఈ మధ్యనే విజ్ఞప్తి చేశాడు కూడా. దాని తాళాలు అతని చేతికి చిక్కితే ఏమాత్రం సంకోచించకుండా క్షణం కూడా ఆలస్యం వాటి బటన్ నొక్కేయడం ఖాయమని చెప్పవచ్చు.
సరిగ్గా ఇటువంటి సమయంలో కాశ్మీర్ అల్లర్లపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నిన్న డిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ‘పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘనపై కూడా చర్చించాలని’ అన్నారు. అయితే అదేదో యుద్ద ప్రకటన అన్నట్లుగా మీడియా చిత్రీకరించడం విస్మయం కలిగిస్తుంది. ఆయన పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని మళ్ళీ స్వాధీనం చేసుకొంటామని చెప్పలేదు. కాశ్మీర్ పై పాక్ ప్రభుత్వం చేస్తున్న వాదనలకి ‘టిట్-ఫర్-టాట్’గా మాత్రమే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు అంతే. కనుక ఆ వ్యాఖ్యలపై ఇరుదేశాల మధ్య మరికొన్ని రోజుల పాటు కొన్ని పంచ్ డైలాగ్స్ వినిపించడం ఖాయం. ఆ తరువాత మళ్ళీ అంతా షరా మామూలే. గత ఆరు దశాబ్దాలుగా భారత్-పాక్ సంబంధాలు ఎప్పుడూ ఇలాగే ఉన్నాయి. ఇప్పటికీ ఇలాగే ఉంటాయి కూడా.