వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటి అమలు పట్ల ఆయా రాష్ట్రాల్లోని ప్రజల సంతృప్తి స్దాయిపై ప్రధానమంత్రి ఇటీవల సర్వే చేయించినట్లు ప్రచారం జరిగుతోంది. సదరు ప్రచారంలో తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు మొదటి స్ధానం రాగా చంద్రబాబుకు ఐదవ స్ధానం వచ్చిందని తొలుత ప్రచారం జరిగింది. అయితే, చంద్రబాబుకు వచ్చింది ఐదవ ర్యాంకు కాదని 13వ ర్యాంకుగా తాజాగా ప్రచారం మొదలైంది. రెండో స్దానంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్, మూడో స్దానంలో ఛత్తీస్ఘర్ సిఎం రమణ్‌సింగ్, ఐదవస్దానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఉన్నట్లు ఇంగ్లీషు డైలీలలో వార్తలు వచ్చాయి. ఈనెల 16వ తేదీన ఢిల్లీలో జరుగనున్న ముఖ్యమంత్రుల సమావేశంలో స్వయంగా ప్రధానమంత్రే ర్యాంకులను ప్రకటిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది.
మన జాతీయగీతం ”జనణమణ” ను ప్రపంచంలోనే ఉత్తమ జాతీయగీతంగా యునెస్కో ఎంపిక చేసిందన్న అసంబద్దమైన, తప్పుడు ప్రచారానికీ – ప్రధాని ముఖ్యమంత్రుల తీరుతెన్నులకు రాంకింగ్ ఇస్తారన్న ప్రచారానికీ పెద్దతేడాలేదు. ఏదేశానికి ఆదేశానిదే సార్వభౌమత్వం… జాతీయగీతాన్ని నిర్ణయించుకీనే స్వేచ్ఛ దేశాలదే! ఇందులో పోటీ పెట్టడానికి అంతర్జాతీయ సాంస్కృతిక వేదిక అయిన యునెస్కోకి గాని అసలు మరేసంస్ధకైనా గాని అధికారం ఎలా వుంటుంది?
భిన్నరాష్ట్రాలు, వేర్వేరు సమస్యలు, వేర్వేరు వనరులు, వేర్వేరు, అనుకూలతలు, వేర్వేరు ప్రతి కూలతలు, వేర్వేరు రాజకీయ పార్టీలు…ఇన్ని భిన్నత్వాల మధ్య రాష్ట్రాలను పరిపాలిస్తున్న ముఖ్యమంత్రుల కు ప్రధానమంత్రే గ్రేడింగ్ ఇవ్వడం నిజమే అయితే మరి ప్రధానమంత్రికి ర్యాంకు ఎవరు ఇస్తారు? ఈ ప్రచారమే నిజమైతే కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష అనుచిత జోక్యం భారత ఫెడరల్ స్వభావాన్ని దారుణంగా దెబ్బతీయడమే అవుతుంది! అది ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి తలగోక్కోవడమే అవుతుంది!
ఒక వేళ పోటీ నిజమే అనుకున్నా రాజధానేలేని, చట్టప్రకారం ఇవ్వవలసిన నిధులను కేంద్రమే ఎగవేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకీ, మిషన్ భాగీరధ లాంటి పధకాలకు సొంత బడ్జెట్ నుంచే 40 వేలకోట్లరూపాయలు కేటాయించగలిగిన తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కీ, లెఫ్టినెంట్ గవర్నర్ బ్యాక్ సీటు డ్రైవింగ్ వల్ల ఒక పోలిస్ కానిస్టేబుల్ ను కూడా ట్రాన్స్ఫర్ చేయలేని డిల్లీ ముఖ్యమంత్రి కెజ్రీవాల్ కీ మధ్య పోటీ ఏ విధంగా సమంజసం! ఏ విధంగా న్యాయం?
అయితే, దేశాన్ని కాంగ్రెస్ ఏలినప్పుడు 20 సూత్రాల ఆర్ధిక పధకం మీద రాష్ట్రాలవారీగా ర్యాంకులు ఇచ్చేవారు. అపుడు దేశంలో మెజారిటీ రాష్ట్రాలు కాంగ్రెస్ పాలనలో వుండేవి కనుక అవి కేంద్రం ర్యాంకుల మీద భయభక్తులు చూపించేవి! అప్పట్లో ఆంధ్రప్రదేశ్ తో సహా అనేక రాష్ట్రాలు 20 సూత్రాల ఆర్ధిక కార్యక్రమాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసుకున్నాయి. ర్యాంకింగల్లో పాయింట్ల వల్ల అదనపు నిధులు తెచ్చుకునేవి. అది కేంద్రం నిధులతో అమలైన పధకాల మీద రేటింగేతప్ప రాష్ట్రప్రభుత్వాల మీద రేటింగ్ కాదు..ముఖ్యమంత్రుల ర్యాంకింగ్ అసలేకాదు.
అప్పట్లో కరుణానిధిని విలేకరులు ” ఈ ర్యాంకింగ్ లో తమిళనాడు ఎందుకు వెనకబడింది” అని ప్రశ్నించారు. అపుడు ఆయన వేస్ట్ పేపర్ బాస్కెట్ చూపిస్తూ ” డిల్లీ నుంచి వచ్చిన ఆ పేపర్ ఏ బుట్టలో వుందో తెలియదు. మన ప్రాధాన్యతలు మనకి వున్నాయి. మనకి ఇవ్వవలసిన డబ్బులు వాళ్ళు ఇస్తే చాలు మనమే పని చేసుకుంటాము వారు మనకి పరీక్షలు పెట్టనవసరం లేదు” అని ఈసడించుకున్నారు.
రాష్ట్రాల వారీగా స్ధితిగతులను తెలుసుకోడానికి నరేంద్రమోదీ కూడా ఇంటెలిజెన్సు నివేదికలు తెప్పించకోవచ్చు! ప్రయివేటు ఏజెన్సీలతో సర్వే చేయించకోవచ్చు. వాటి ఆధారంగా సెంట్రల్ స్పాన్సర్డ్ పధకాలకు రాష్ట్రాల వారీగా ర్యాంకింగ్ ఇచ్చుకోవచ్చు! మహా అయితే బిజెపి ముఖ్యమంత్రులకు ప్రశంశలో మందలింపులో ఇవ్వవచ్చు!
అంతే తప్ప దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రుల పనితీరు తెన్నులకు ర్యాంకింగో, రేటింగో ఇచ్చే అవకాశం నేరుగా ప్రధానికో, కేంద్రానికో లేదు.