హైదరాబాద్: ‘దొంగలుపడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినట్లు’ అన్న చందాన దాద్రి ఘటనపై దేశమంతా కలకలం రేగుతుంటే, దానిపై స్పందించటానికిగానూ ప్రధాని నరేంద్రమోడికి స్పందించటానికి ఇన్ని రోజులకుగానూ టైమ్ దొరికింది. దాద్రి ఘటన, పాకిస్తాన్ గాయకుడు గులామ్ అలీ కచేరీపై నిషేధం సంఘటనలు దురదృష్టకరమని మోడి ఇవాళ వ్యాఖ్యానించారు. కొల్కతానుంచి వెలువడే ఆనందబజార్ పత్రిక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇలా స్పందించారు. ఇటువంటి ఘటనల వెనక ఉన్నవారిని భారతీయ జనతాపార్టీ ఎప్పుడూ సమర్థించదని చెప్పారు. అయితే ఈ ఘటనలకుగానూ కేంద్రాన్ని నిందించటం సబబుకాదని అన్నారు. ఇలాంటి విభేదాలు వచ్చిన ప్రతిసారీ బీజేపీ సెక్యులరిజాన్ని అనుసరించిందని చెప్పారు. బీజేపీ మతవిద్వేషాలను, వర్గతత్వాన్ని ప్రోత్సహిస్తోందని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, అసలు వాతావరణాన్ని చెడగొడుతున్నది వారేనని ఆరోపించారు. వారు గతంలో పాలించినపుడు మైనారిటీలను ఓట్ బ్యాంకులుగా చూసేవారని, మైనారిటీలు అభివృద్ధి చెందాలని కోరుకునేవారుకాదని మోడి అన్నారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయని, సూడో సెక్యులరిజాన్ని బీజేపీ మొదటినుంచీ వ్యతిరేకించిందని చెప్పారు.
గత నెల 28న జరిగిన దాద్రి ఘటనపై దేశవ్యాప్తంగా రోజురోజుకూ నిరసనలు పెరిగిపోతుంన్నాయి. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ మేనకోడలు నయనతార సెహగల్ దగ్గరనుంచి ఎందరో రచయితలు, ప్రముఖులు తమ సాహిత్య అకాడమీ పురస్కారాలను, పద్మశ్రీ అవార్డులను తిరిగి ఇస్తుండటం ఒత్తిడిని పెంచినట్లయింది. మూడురోజుల క్రితం బీహార్ ఎన్నికల ప్రచారసభలో పరోక్షంగా స్పందించటం మినహా దాద్రి ఘటనపై మౌనంగా ఉన్న మోడి ఇవాళ నేరుగా స్పందించారు.