“మరో 20 ఏళ్ల వరకు చంద్రబాబు నాయుడే ఏపికి ముఖ్యమంత్రిగా ఉంటారు. రాష్ట్రంలో తెదేపాయే శాస్వితంగా అధికారంలో ఉండాలి. రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదు,” ఇదీ తెలుగుదేశం పార్టీ కోరిక. అటువంటి కోరికే తెరాసకి ఉంది.. భాజపాకి ఉంది దేశంలో అన్ని రాజకీయ పార్టీలకి కూడా ఉంది. అంటే అధికారంలో ఉన్న మన రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య వ్యవస్థను ఇష్టపడటం లేదని, ఆ ముసుగులో వంశపారంపర్యంగా రాజరికపాలన సాగించాలని కోరుకొంటున్నట్లు అర్ధమవుతోంది.
ఒకప్పుడు ఇటువంటి ఆలోచన ఎవరికీ వచ్చేది కాదు. వచ్చినా ఆవిధంగా నలుగురిలో మాట్లాడటానికి ధైర్యం చేసేవారుకారు. కానీ ఇప్పుడు అటువంటి భయాలు, భేషజాలు ఏమీ లేవు. అన్నీ ప్రజాస్వామ్య ముసుగులోనే సరికొత్త పేర్లతో, నిర్వచనాలతో సాగిపోతున్నాయి. కానీ వాటి దురద్రుష్టమో లేకపోతే ప్రజల అదృష్టమో కానీ ఇంకా దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు తమకు నచ్చిన వాళ్ళకి అధికారం అప్పజెప్పుతున్నారు నచ్చని వాళ్ళని నిర్దాక్షిణ్యంగా పక్కన పడేస్తున్నారు. ఈ విషయం వంశపారంపర్య రాజరిక వ్యవస్థని కోరుకొంటున్న మన రాజకీయ పార్టీలన్నిటికీ కూడా తెలుసు. కానీ అవి పగటి కలలు కనడం మానుకోలేకపోతున్నాయి. ఆ కలలను సాకారం చేసుకోవడానికి ప్రజాస్వామ్య ముసుగులో ఎంతకైనా దిగజారడానికి వెనుకాడటం లేదు.
వివిద రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఏవిధంగా తామే శాస్వితంగా అధికారంలో ఉండాలని కలలు కంటున్నాయో, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కూడా అలాగే కలలు కంటోంది. కేంద్రమంత్రి రాం విలాశ్ పాశ్వాన్ నిన్న శ్రీనగర్ లో మీడియాతో మాట్లాడుతూ “మరో 15 ఏళ్ల వరకు నరేంద్ర మోడీయే ప్రధానమంత్రిగా ఉంటారు. రెండేళ్ళ పాలనలో ఆయన శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా చేస్తూనే ఉంటారు. కనుక కాంగ్రెస్ పార్టీ ఎంత హడావుడి చేసినా ఏమీ ప్రయోజనం ఉండదు,” అని అన్నారు.
80 శాతం మంది ప్రజలు సంతృప్తి చెందినప్పుడే పరిపాలన సరిగ్గా సాగుతున్నట్లు అని చంద్రబాబు నాయుడు అన్న మాటలు నూటికి నూరు పాళ్ళు నిజమే. అది రాష్ట్ర ప్రభుత్వాలకే కాదు కేంద్రానికి కూడా వర్తిస్తుంది. కనుక ప్రజలు సంతృప్తి చెందేవిధంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందా లేదా అని ఎప్పటికప్పుడు వాళ్ళే పరిశీలించి చూసుకోవడం మంచిది.