కొత్తగా కేంద్ర కేబినెట్లోకి 43 మంది మంత్రులు వస్తున్నారు. కానీ వారిలో ఒక్కరంటే ఒక్కరూ ఆంధ్రా మంత్రులు లేరు. ఏపీ నుంచి ఒకరికి చాన్సివ్వబోతున్నారని.. నిన్నటి నుంచి ఢిల్లీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరిగింది. అది సీఎం రమేష్కేనని కూడా చెప్పుకున్నారు. కానీ చివరికి సహాయమంత్రుల జాబితాలో కూడా ఆయన పేరు మిస్సయింది. ఆయన పేరే కాదు.. ఆంధ్ర నుంచి కానీ.. ఆంధ్ర మూలాలున్న వ్యక్తులకు కానీ పదవి దక్కలేదు. కొంత మంది జీవీఎల్ నరసింహారవుకు పదవి ఇస్తారని అనుకున్నారు. కానీ అటు సీఎం రమేష్‌కు కానీ.. ఇటు జీవీఎల్‌కు కానీ పిలుపు రాలేదు. అధికారిక మీటింగ్‌కు ప్రధాని పిలువకపోవడంతోనే క్లారిటీ వచ్చేసింది.
రెండో సారి ప్రధాని అయిన తర్వాత మోడీ.. మొదటి సారి కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేశారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు ఏమైనా గుడ్ న్యూస్ ఉందంటే.. అది కేవలం.. ప్రస్తుతం హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి.. కేంద్ర కేబినెట్ మంత్రిగా పదోన్నతి ఇవ్వడమే. కర్ణాటక నుంచి కొత్తగా నలుగురికి చాన్సిచ్చారు. ఒడిషా, తమిళాడు నుంచి కూడా… మంత్రులకు అవకాశం దక్కింది. కానీ ఏపీకి మాత్రం మొండిచేయే మిగిలింది.
కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించాలనుకున్న మోడీ.. దాదాపుగా పదిహేను మందికి ఉద్వాసన పలికారు. అందులో సదానందగౌడ, పోఖ్రియాల్, హర్షవర్ధన్ వంటి కీలక మంత్రులు ఉన్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పూర్తిగా సామాజిక సమీకరణాలు… సామర్త్యం లెక్కలోకి తీసుకుని కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించినట్లుగా చెబుతున్నారు. ఏదేమైనా స్వతంత్ర భారతవనిలో… ఓ రాష్ట్రానికి కేంద్రమంత్రివర్గంలో అసలు ప్రాతినిధ్యమే లేకపోవడం.. అలాంటి దుస్థితికి ఏపీకి రావడం ఇదే మొదటి సారి అనుకోవచ్చు.