కీలకమైన సహజమైన వ్యవసాయరంగాన్ని మూలన పడేసి, వస్తూత్పత్తి రంగాన్ని విస్మరించి, కార్పొరేట్ భూతానికి చిన్న మధ్య తరహా వ్యాపారాలను ఆహారంగా అప్పగించి అంకెల్లో వృద్ధి రేటుని, వాస్తవంలో ఆర్ధిక అసమానతల్ని పెంచేసిన నరేంద్రమోదీ ఆర్ధిక విధానాల డొల్లతనం గుజరాత్ లో బయటపడింది. ఆర్ధిక సంస్కరణలు, ఉదార విధానాల ఒక దుష్పలితం పేదలు మరింత పేదలైపోవడం…ఇది ప్రపంచమంతటా కనబడుతున్నదే. అయితే సామాజికంగా బలం, ఎంతోకొంత ఆర్ధిక స్తోమత వున్న వర్గాలుకూడా కుదేలైపోతున్న పరిస్ధితి గుజరాత్ లో వుంది. ముఖ్యమంత్రిగా ఆరాష్ట్రాన్ని 13 ఏళ్ళ ఏలిన నరేంద్రమోదీ అమలు చేసిన విధానాల ఫలితమే ఇదంతా! ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రయివేటీకరణల పర్యావసానమే అక్కడ పటేళ్ళ ఆందోళన.
గుజరాత్ లో పటేల్ కులస్ధులు సామాజికంగా ప్రాబల్యం వున్నవారు. బిజెపి జాతీయ అద్యక్హుడు, గుజరాత్ ముఖ్యమంత్రి కూడా ఆకులస్ధులే. సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా ముందున్న పటేళ్ళ లోనే రోడ్డున పడే స్ధాయికి నిరుద్యోగం చేరుకుందంటే గుజరాత్ అభివృద్ది ఏపాటిది? ఎలాంటిది ?అనే మౌలిక ప్రశ్నలు తల ఎత్తుతున్నాయి.
వ్యవసాయం, వ్యాపారాలు, పరిశ్రమలు, అంతర్జాతీయ వాణిజ్యం, హోటళ్లు, ఫైనాన్స్, వడ్డీ వ్యాపారాల్లో గుజరాత్ నుంచి అమెరికా వరకు పటేళ్లదే ఆధిపత్యం. అమెరికా కేంద్రంగా అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడి స్థాయికి ఎదిగారు. మరో వైపు సంపదలో ఆధిపత్యం కలిగినవారిలో పటేళ్లదే అగ్రస్థానమైనా, అదే పటేళ్లలో నూటికి 70 శాతం మంది మధ్య, పేద తరగతులవారే. గుజరాత్ లో వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్యలు చేసుకున్న 1,500 మందిలో పటేళ్లే ఎక్కువమంది.. అప్పులు చేసి పిల్లలను చదివించినా ఉద్యోగానికి దిక్కులేదు. పైగా పరిశ్రమలకు ప్రోత్సాహం పేరుతో మోడీ ప్రభుత్వంలో వ్యవసాయానికిచ్చే ప్రోత్సాహకాలు తగ్గించడమే కాకుండా భూముల్ని కార్పొరేట్లకు ధారాదత్తం చేసింది. రైతుల పిల్లలను చదివించుకుంటే ఉద్యోగాలొస్తాయి. ఉద్యోగాలొస్తే ఇంతకన్నా బాగా బతకవచ్చని భ్రమింప జేశారు. నిజమేనని నమ్మిన రైతులు మోసపోయామని ఇప్పుడు ఆందోళనతో రోడ్డున పడ్డారు.
గుజరాత్ లో 76 శాతం మంది వ్యవసాయ రంగంమీద ఆధారపడివున్నారు. గత 10 ఏళ్ళలో గుజరాత్ వృద్ధిరేటు పెరిగి 8వస్ధానం వద్ద నిలచింది. అయితే ఇది దాదాపు సర్వీసు రంగంలోనే కేంద్రీకృతమైంది. వ్యవసాయరంగ వృద్ధి మాత్రం ఏడాదికేడాదికి క్షీణిస్తోంది. మోదీ విధానాలవల్ల కార్పొరేట్ రంగం విస్తరించి దాదాపు 2 లక్షల మధ్య చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. 20 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. వ్యాపార రంగంలోకి కార్పొరేట్ కంపెనీలు అడుగిడడంతో స్ధానిక మధ్యతరహా, చిన్నతరహా వ్యాపార సంస్థలు మూతబడ్డాయి.
చదువుకున్న యువకులకు ఉపాధి అవకాశాలు మూసుకుపోయాయి. పదేళ్ళలో మూడుసార్లే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారు. ఉద్యోగాలు, ఉపాది, ఆదాయాలు లేనివారు ప్రతి 1000 మందికి కర్ణాటకలో 34.5 మంది, ఎపి, తెలంగాణాల్లో 59, ఒరిస్సా 65, తమిళనాడులో 69, మహారాష్ట్రలో 70 ఉంటే గుజరాత్లో అత్యధికంగా 86 మంది ఉన్నారు. పటేల్ కులంలో అక్షరాస్యతలోనూ, ఉన్నత విద్య అభ్యసించడంలో ముందున్నారు. చిన్నస్థాయి పరిశ్రమ అధిపతులుగా వ్యాపార రంగంలో ధనిక, భూస్వామ్య రైతులుగా ఎక్కువగా ఉన్నారు. మోడీ ప్రధానమంత్రి అయితే ఉపాధి వస్తుందని, బాగుపడతామని ఆశించారు.
ఏడాది కాలంలో ఏమీ నెరవేరక పోవడంతో ఆందోళన మరింత ముదిరింది. మోదీ విధానాలు వీరి జీవన స్థితిగతులను నాశనం చేసి, వారి ఆదాయానికి భారీ నష్టాన్ని చేకూర్చాయి. ఫలితంగా పెద్ద ఎత్తున పటేళ్ళు రోడ్డున పడ్డారు. మోదీ ప్రాచుర్యంలోకి తెచ్చిన సోషల్ మీడియా వల్లే తక్కువ కాలంలోనే ఉద్యమం రాజుకుంది.దీనికి నాయకత్వం వహించిన హార్ధిక్ పటేల్ చాకచక్యం ఉద్యమానికి బాగా ఉపయోగపడింది. హింసకు దారితీసి పోలీసుకాల్పుల్లో ఎనమండుగురిని బలితీసుకుంది బిజెపి మోదీల అభివృద్ధి డొల్ల అని ఈ ఉద్యమం చాటుతోంది. గుజరాత్ వెలిగిపోవడం లేదు రగిలిపోతోంది అని స్పష్టం చేస్తోంది. పటేళ్ళ ఆందోళనలో ఇది ఆర్ధికకోణం మాత్రమే. ఇందులో సామాజిక స్దానిక కులాధిపత్య అంశాలు కూడా ఇమిడి వున్న పటేళ్ళ ఉద్యమంలో ఇది కేవలం ప్రభుత్వ ఆర్ధిక విధానాల ప్రభావితం చేసిన కోణం మాత్రమే!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో చంద్రబాబుతో సహా ప్రతీ ముఖ్యమంత్రీ గుజరాత్ మోడల్ ను సూక్ష్మంగా పరిశీలించాకే మోదీ మోడల్ ఆచరణ గురించి తుది నిర్ణయాలు తీసుకోవాలి