ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. ఆయన టూర్ షెడ్యూల్ కూడా ఖరారైంది. చిలకలూరిపేటలో ఉమ్మడి ప్రచార సభ నిర్వహించిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి ప్రాధాన్యంఇచ్చారు. నాలుగో విడతలో ఏపీలో ఎన్నికలు జరగనుండటంతో రెండు రోజుల సమయం కేటాయించారు.
మోడీ మళ్లీ ఈ నెల 6, 8 తేదీల్లో రాష్ట్రంలో ప్రచారానికి రానున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభల్లో టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మే 6న రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో బహిరంగసభ నిర్వహిస్తారు. అక్కడే గతంలో మహానాడు నిర్వహించారు. తర్వాత అనకాపల్లిలో రోడ్ షో నిర్వహిస్తారు. మే 8న పీలేరు అసెంబ్లీ పరిధిలో కలికిరి వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్దకు చేరుకుని బెంజ్ సర్కిల్ వరకు రోడ్ షోలో పాల్గొననున్నారు.
మేనిఫెస్టోపై మోదీ ఫోటో లేదని.. బీజేపీకి కూటమిలో ఉండటం ఇష్టం లేదని వైసీపీ ప్రచారం చేస్తోంది. తాము బీజేపీతో ఉంటామని అవసరం లేకపోయినా ప్రకటనలు చేస్తున్నారు. ఈ సమయంలో మోదీ వచ్చి గట్టిగా విమర్శిస్తే.. పరువు పోతుందని వైసీపీ నేతలు కూడా కంగారు పడుతున్నారు. చిలుకలూరిపేట సభలో మోదీ సరిగ్గా విమర్శించలేదని వైసీపీ నేతలు ఆనందపడ్డారు. ఈ ఆనందాన్ని మోదీ కొనసాగిస్తారో.. షాకిస్తారో చూడాల్సి ఉంది.