ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో సైన్యం, మతం ఈ రెండు అంశాలను ఏ స్థాయిలో వినియోగిస్తున్నారో చూస్తున్నాం. ఇప్పుడు ఈ రెంటినీ కలిపేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజస్థాన్, గుజరాత్ లలోని కొన్ని ప్రాంతాల్లో మోడీ ప్రచారం ప్రస్తుతం సాగుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రచార సభల్లో ఆయన మాట్లాడుతూ… అభినందన్ వర్థమాన్ గురించి ప్రస్థావించారు! పాకిస్థాన్ ఆయన్ని సురక్షితంగా ఇండియాకి తిరిగి పంపిందంటే కారణం… ఆ దేశాన్ని తాను హెచ్చరించిన తీరే అని చెప్పుకొచ్చారు. అభినందన్ పట్టుబడ్డాక ఇక్కడ ప్రతిపక్షాలు తనపై చాలా విమర్శలు చేశాయన్నారు. దాంతో తానొక కఠినమైన నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాననీ, ప్రధాని పదవి ఉన్నా పోయినా…. దేశంలో ఉంటే తానైనా ఉండాలి, లేదంటే ఉగ్రవాదులైనా ఉండాలని అనుకున్నానన్నారు. అందుకే, ప్రెస్ మీట్ పెట్టి మరీ పాకిస్థాన్ ను తీవ్రంగా హెచ్చరించానన్నారు.
దాంతో భయపడ్డ పాకిస్థాన్ అభినందన్ ను వెనక్కి పంపించిందన్నారు. లేదంటే, పాక్ కి ఆ రాత్రి కాళరాత్రి అయ్యేదన్నారు. పుల్వామా ఘటన తరువాత ప్రజలు తనను నుంచి ఏదైతే ఆశించారో అదే చేశానన్నారు. కానీ, ముంబైలో ఉగ్రవాదుల దాడి అనంతరం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మాదిరిగా వ్యవహరించి ఉంటే దేశం తనను క్షమించి ఉండేదా అంటూ కాంగ్రెస్ పాలనపై విమర్శల దాడి చేశారు మోడీ! హనుమాన్ భక్తుల్లాగ మన సైనికులు బాలాకోట్ పై విరుచుకుపడ్డారని మెచ్చుకున్నారు. ఓపక్క బాలాకోట్ లో దాడి జరుగుతుంటే.. ఇక్కడి ప్రతిపక్షాలు రాజకీయాలు మాట్లాడుతూ కూర్చున్నాయన్నారు.
ప్రతిపక్షాలది రాజకీయమైతే… ఇప్పుడు సైనిక దాడుల గురించి ఇంతగా మాట్లాడటం ఏమౌతుంది..? సైనికులను హనుమాన్ భక్తులతో పోల్చడం సరైందా..? భారత సైన్యానికి కూడా భారతీయ జనతా పార్టీ భావజాలం అంటగట్టేయడం సరైందా..? అభినందన్ ను వెనక్కి తీసుకొచ్చిన వైనాన్ని… తన వీరగాథలాగ మోడీ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడం దారుణం. ఎన్నికల ముందు ఈయనే చెప్పారు కదా…. సైనిక చర్యలను రాజకీయాల కోసం ఎవ్వరూ వాడుకోకూడదని! ఇప్పుడు మోడీ చేస్తున్నది ఏంటి..? ఇంకోటి… ముంబై దాడులను ప్రస్థావిస్తూ అప్పటి ప్రధాని మన్మోహన్ వైఖరిని తప్పుబడుతున్నారు. అంటే, ప్రతీకారమే ప్రతీదానికీ సమాధానమా..? ఇన్నాళ్లూ మతమూ, సైనిక చర్యలను వేర్వేరుగా ప్రచారం చేస్తూ వచ్చిన మోడీ… ఇప్పుడు రెంటినీ కలిపేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ధోరణి ఎటువైపునకు వెళ్తోందో అనే ఆందోళన కలుగుతోంది. ఎందుకంటే, సైన్యంలో అన్ని మతాలవారూ కులాలవారూ ఉంటారు. అవన్నీ వదిలేసి కేవలం దేశం కోసమే పనిచేస్తుంటారు. ఆ స్ఫూర్తిని అర్థం చేసుకోలేని పరిస్థితిలో దేశ ప్రధానే ఉంటే ఇంకేమనాలి?