అయిదు రాష్ట్రాల ఎన్నికలకు గంట మోగింది. అంతవరకు అంతా బాగానే ఉంది. అయితే మోడీ ప్రచారం ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో మోడీ చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టారు. చాలా పర్యాయాలు ఆ రాష్ట్రంలో పర్యటించారు. సభలు నిర్వహించారు. విస్తృతంగా పర్యటించారు. వేల లక్షల కోట్ల రూపాయల హామీలు కురిపించారు. ఎన్ని చేసినప్పటికీ.. బీహార్ ప్రజలు మోడీని భయంకరంగా తిరస్కరించారు.
అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు వేరు. అందుకే ఈ రాష్ట్రాల్లో ఆయన ప్రచారం ఎలా ఉండబోతున్నదనేది ఆసక్తికరంగా ఉంది.
ప్రస్తుతం ఎన్నికలు జరగబోతున్న అయిదు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు చాలా కీలకమైన రాష్ట్రాలు. కేంద్రంలో సంఖ్యాబలం పరంగా కూడా కీలకమైనవి. ఈ రెండు చోట్ల ఎన్డీయే కూటమితో సంబంధంలేని పార్టీలే అధికారంలో ఉన్నాయి. ఈ రెండు చోట్ల మహిళలే రాజ్యమేలుతున్నారు. నిజానికి ఈ రెండు రాష్ట్రాల్లో బలం పుంజుకోవడం అనేది.. వ్యూహాత్మకంగా చాలా కీలకం గనుక.. ఎవరైనా సరే ఈ రెండు చోట్ల ఎక్కువ ఫోకస్ పెడతారని అంతా భావిస్తారు.
కానీ రాజకీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. బీహార్ ఎన్నికల మీద దృష్టిపెట్టినంత కీలకంగా మోడీ ఈరెండు రాష్ట్రాల గురించి పట్టించుకునే అవకాశం లేదని అంటున్నారు. ఎందుకంటే.. అక్కడ నితీశ్ బలం సన్నగిల్లిందని అనుకుంటున్న తరుణంలోనే… మోడీ అంత ఎఫర్ట్ పెట్టినా పార్టీ పతనం అయిపోయింది.
అలాంటిది.. ఈ దఫా అసలు భాజపాకు ఎలాంటి అస్తిత్వమూ లేని తమిళనాడులో గానీ, నామమాత్రంగా ఉనికి ఉన్న వెస్ట్ బెంగాల్లోగానీ.. మోడీ తల్లకిందులుగా తపస్సు చేసినా.. పార్టీని అక్కడ అధికారంలోకి తీసుకురావడం కల్ల అని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. అందుకే కష్టం ధారపోసి ఖంగుతినడం కంటె, ముందుగానే మన హద్దుల్లో మనం ఉంటే మంచిదనే వ్యూహం ప్రకారం మోడీ వెళ్తారని అంతా అనుకుంటున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో విస్తృత ప్రచారం ఉండదని, అక్కడ అడుగుపెట్టాలంటేనే మోడీకి భయం అనే సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి తన కరిష్మాను నిరూపించుకోవడానికి మోడీ.. ఎలాంటి జిమ్మిక్కులు నడిపిస్తారో చూడాలి.