2014లో నరేంద్రమోడీ అధికారంలోకి రావాలని అన్ని వర్గాలూ కోరుకున్నాయి. వారిలో రైతులు ఎక్కువగా ఉన్నారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ.. రకరకాల ప్రకటనలు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కలలు కల్లలయ్యాయి. మూడేళ్లు ఓపిక పట్టిన రైతులు.. రోడ్ల మీదకు రావడం ప్రారంభించారు. ఇప్పుడు వారి ఆగ్రహం ఓట్ల రూపంలోకి మారుతోంది. దేశవ్యాప్తంగా బీజేపీకి వరుసగా ఎదురవుతున్న పరాజయాల వెనుక రైతుల ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే..మోడీ ఇప్పుడు… కొత్తగా రుణమాఫీ అనే అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. రూ. 4 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసి ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్లు మీడియాకు బీజేపీ అగ్రనేతలు సమాచారం ఇస్తున్నారు.
యూపీపీ -1 ప్రభుత్వ హయాంలో.. దేశవ్యాప్తంగా రూ. 70వేల కోట్ల రుణాలను మాఫీ చేసి.. ఎన్నికలకు వెళ్లారు.ఫలితంగా యూపీఏ -2 సర్కారు ఏర్పడింది. ఇప్పుడు ఎన్డీఏ-2 కోసం మోడీ కూడా.. అదే తరహా స్కెచ్ వేస్తున్నట్లు తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. రాహుల్ గాంధీ..తన ఎన్నికల ప్రచారాస్త్రంలో మొదటగా రూ. 2 లక్షల రుణమాఫీని ప్రకటిస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ రుణమాఫీని బీజేపీ వ్యతిరేకించింది. వ్యవసాయ ఆదాయాన్ని పెంచడమే లక్ష్యమని ఎప్పుడూ ఘనంగా ప్రకటించే నరేంద్ర మోదీ.. ఆ లక్ష్యాన్ని సాధించడంలో విఫలమయ్యారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఓటమికి రైతుల ఆగ్రహమే కారణం. ఆ రాష్ట్రాల జనాభాలో 70 శాతం వ్యవసాయం మీద ఆధారపడేవారే. మోదీ హయాంలో వ్యవసాయ ఆదాయం గణనీయంగా తగ్గిపోవడంతో వారంతా కోపంగా ఉన్నారు.
ఎన్నికలకు ఇంకా నాలుగైదు నెలల సమయమే ఉండడంతో.. 26.3 కోట్ల మంది రైతుల మద్దతు పొందేందుకు మోదీ సర్కారు ఈ దేశవ్యాప్త రుణమాఫీ ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే కేంద్రం వద్ద నిధులు లేవు. మరి రుణమాఫీ ఎలా చేస్తుందనేది.. ఆసక్తికరంగా మారింది. దీనికి ఆర్బీఐలోని తాజా పరిణామాలే.. కారణం అని చెబుతున్నారు. ఆర్బీఐ వద్ద ఉన్న రిజర్వ్ నిధులు రూ. 9 లక్షల కోట్లు తీసుకుని రుణమాఫీ చేస్తే సరిపోతుదంని… బీజేపీ అగ్రనాయకత్వం అంచనా వేస్తోంది. అందుకే ఆర్బీఐ గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ ను సాగనంపి.. కొత్తగా తమ మాట వినే శక్తికాంత దాస్ ను కూర్చొబెట్టారని చెబుతున్నారు.