కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీరేమి మారడం లేదు. మళ్లీ హిందుత్వ కార్డుతో ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దమైనట్లుగా కనిపిస్తోంది. ఇందుకోసం భావోద్వేగాలను రాజకీయాల కోసం వాడుకుంటున్నారన్న విమర్శలు వస్తోన్న వేళ తాజాగా ప్రధాని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఆదివారం రాజస్థాన్ లోని బన్స్వారాలో, జాలోర్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ ప్రజల సంపదను ముస్లింలకు పంపిణీ చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ ఆస్తులను చొరబాటుదారులకు పంచుతారు. అది మీకు అమోదయోగ్యమేనా? అంటూ ప్రశ్నించారు. మంగళసూత్రం విలువ బంగారంలోనో, ధరలోనో లేదని… ఆమె కలలకు ప్రతిరూపమైన దాన్ని లాక్కోవడం గురించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
పదేళ్లు అధికారంలో కొనసాగిన పార్టీ ఎన్నికల వేళ హిందుత్వ కార్డు అప్లై చేయడం ఏంటని…అభివృద్ధి పేరిట ఓట్లు అడిగే సాహసం ఎందుకు చేయడం లేదన్న ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. మోడీ చేసిన వ్యాఖ్యలు ఈ దేశ ప్రజల మధ్య విభజన తీసుకొచ్చేలా ఉన్నాయని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది. మోడీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు.
పదేళ్ల బీజేపీ హయాంలో దేశమంతా వెలిగిపోతుందని ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. అయినప్పటికీ ఎన్నికల ప్రచారంలో ఆ అభివృద్ధి నమూనాను ప్రస్తావించకుండా హిందూ- ముస్లిం అనే ఎజెండాతో బీజేపీ ఎన్నికలకు వెళ్తున్నట్లుగా స్పష్టం అవుతుందంటున్నారు రాజకీయ పండితులు. స్వయంగా ప్రధానే ఓ మతానికి ప్రాధాన్యత ఇచ్చేలా వ్యాఖ్యలు చేయడంతో వారి ఎన్నికల ప్రచారాస్త్రం ఏంటో ఈజీగా అర్థం అవుతుందని విశ్లేషిస్తున్నారు.