మరోసారి తిరుగులేని ఆధిక్యతతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు నరేంద్ర మోడీ. గత ప్రభుత్వంలో పాలనకీ, ఈ ప్రభుత్వంలో పాలనకీ వ్యవస్థాగతంగా సమూల మార్పులు చేస్తారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే, దాని కంటే ముందుగా తన ఇమేజ్ మీద మోడీ ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన తరువాత… మోడీ వ్యక్తిగత శైలిపై నెమ్మదిగా చాలా విమర్శలు పెరుగుతూ వచ్చాయి. పార్టీలో సీనియర్లకు ఆయన గౌరవం ఇవ్వరనీ, ఎంతటివారినైనా పక్కనపడేస్తారనే విమర్శలున్నాయి. పార్టీ శ్రేణులతో కూడా మోడీ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు భాజపా వర్గాల్లో ఉండేవి. నిజానికి, బహిరంగంగానే ఎల్.కె. అద్వానీ, మురళీ మనోహన్ జోషి లాంటి సీనియర్ల విషయంలో మోడీ, షా ద్వయం ఎలా వ్యవహరించారో చూశాం. ఒక వేదికపై అద్వానీజీ నమస్కారం పెడుతున్నా మోడీ పట్టించుకోకపోవడం… మరో వేదిక మీద ఆయన్ని వెనక వరుసలో కూర్చోమంటూ అమిత్ షా చెప్పడం… ఇలాంటి ఘటనలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇమేజ్ ని మార్చుకునేందుకు మోడీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా చెప్పొచ్చు.
రెండోసారి గెలిచిన తరువాత… సీనియర్ నేత ఎల్.కె. అద్వానీని మోడీ కలుసుకున్నారు. అద్వానీకి పాదాభివందనం చేశారు. దీంతో అద్వానీ కూడా చాలా సంతోషంగా ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు. ఎన్నికల ముందు పార్టీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మరో సీనియర్ నేత మురళీ మనోహన్ జోషిని కూడా ఇదే తరహాలో ఆయన పెద్దరికానికి విలువ ఇస్తున్నట్టు మోడీ వ్యహరించారు. సీనియర్లను పక్కన పెట్టేయడంపై భాజపా శ్రేణుల్లో ఉన్న కొంత అసంతృప్తిని. ఈ చర్యల ద్వారా తగ్గించొచ్చు అనేది మోడీ వ్యూహం కావొచ్చు. ఓరకంగా ఇది మంచి పరిణామమే.
భాజపాకి సొంతంగానే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ ఉంది. గతంతో పోల్చితే ఇంకా బలపడింది. దీంతో, ఈసారి ఎన్డీయే మిత్రపక్షాలకు కేంద్ర ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉండదేమో అనే చర్చ జరుగుతోంది. అయితే, ఈసారి మిత్రపక్షాలకు గతం కంటే ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలని మోడీ భావిస్తున్నారని సమాచారం. ఎందుకంటే, సంప్రదాయ మిత్రపక్షాలను దూరం చేసుకుని… ఒక దశలో కొత్త మిత్రుల కోసం టెన్షన్ పడాల్సిన పరిస్థితి భాజపాకి అనుభవం. కాబట్టి, కొత్త మంత్రివర్గంలో ఆ మేరకు మిత్రపక్షాల ప్రాధాన్యత పెరుగుతుందని అంటున్నారు. ఓవరాల్ గా, దూకుడు, అహంకారం, సీనియర్లను, మిత్రపక్షాలను లెక్కచేయనితనం… ఇలాంటి అభిప్రాయాలేవీ రాకుండా ఇప్పట్నుంచే జాగ్రత్త పడుతున్నట్టుగా ఉంది.