కశ్మీర్లో 370 అధికరణ రద్దుతో వచ్చిన ఉత్సాహమేమో కానీ.. భారత హోంమంత్రి అమిత్ షా సమరోత్సాహంతో ఉన్నారు. పాకిస్థాన్ అధీనంలో ఉన్న కశ్మీర్‌లోని కొంత భాగం… ఇండియాదేనని.. ప్రకటించారు. అలాగే చైనా కంట్రోల్లో ఉన్న అక్సాయ్‌చిన్ ప్రాంతం కూడా కశ్మీర్లో భాగమేనని షా ఉద్ఘాటించారు. పాక్ అధీనంలో ఉన్న కశ్మీర్.. పాక్ ఆక్రమిత కశ్మీర్ .. పీవోకేగా… అది చెలామణి అవుతోంది. భారత్ – పాకిస్తాన్ మధ్య లైన్ ఆఫ్ కంట్రోల్.. ఎల్వోసీ.. నియంత్రణ రేఖ ఉంటుంది. భారత అధీనంలో ఉన్న కశ్మీర్‌ను.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను విడదీసే రేఖ ఇది. ఇది దాదాపుగా 700 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రేఖకు ఇవతలివైపున ఉన్న ప్రాంతం మనం జమ్ముకశ్మీర్‌గా వ్యవహరిస్తున్న భూభాగం. మొత్తం కశ్మీరంలో ఇది కేవలం 45 శాతం మాత్రమే. అలాగే.. పూర్తి కశ్మీర్‌లోని దక్షిణ, తూర్పు భాగాలు ఇవి.
రేఖకు ఆవలి భూభాగం పాకిస్థాన్ ఆక్రమించిన కశ్మీర్ ఉంటుంది. అందులో మూడు ప్రధాన భాగాలున్నాయి. అవి.. ఆజాద్ కశ్మీర్, గిల్గిట్, బాల్టిస్థాన్. మొత్తం కశ్మీరంలో 35 శాతం భాగమైన ఈ ప్రాంతంలో కశ్మీర్ ఉత్తర, పశ్చిమ భాగాలున్నాయి. మొత్తం కశ్మీరంలో 45 శాతం భూభాగం జమ్ముకశ్మీర్ కాగా.. 35 శాతం భూభాగం పీవోకే. అంటే.. 80 శాతం. 20 శాతం అక్సాయ్‌చిన్ ప్రాంతం ఇది. ఇది చైనా అధీనంలో ఉంది. కశ్మీర్‌లోని ఈశాన్య భూభాగం ఇది. ఈ ప్రాంతంలో భారత్ కు చైనాకు మధ్య ఉన్న సరిహద్దు రేఖనే వాస్తవాధీన రేఖ … లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని పిలుస్తున్నారు.
ఇప్పుడు పార్లమెంట్ వేదికగా.. అమిత్ షా… అటు పాకిస్థాన్‌కు.. ఇటు చైనాకు స్పష్టమైన హెచ్చరికలు పంపారు. అఖండ కశ్మీరాన్ని భారత్‌లో కలిపేసుకునేందుకు తాము కృతనిశ్చయంతో ఉన్నామని.. అమిత్ షా సందేశంలోపంపారు. పీవోకే, ఆక్సాయ్‌చిన్ కూడా జమ్ముకశ్మీర్‌లో భాగమేనని తేల్చిచెప్పారు. త్వరలో వాటిని కలిపేసుకోవడానికి అవసరమైన చర్యలు.. మోడీ , షా సూపర్ జోడి.. చేపట్టే అవకాశాలున్నాయని… పార్లమెంట్ ద్వారా సందేశం వెళ్లింది.