అధ్యక్షుడు ఎవరో తేల్చుకోలేకపోతున్నారని రాహుల్ గాంధీ బీజేపిపై పార్లమెంట్‌లోనే సెటైర్లు వేశారు. కాంగ్రెస్‌లా కాదని తమది పెద్ద పార్టీ అని సంప్రదింపులు ఆలస్యమవుతాయని.. ప్రజాస్వామ్యంగా ఎంపిక చేసుకుంటామని అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. కానీ బీజేపీలో అధ్యక్షుడి ఎంపిక ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు. ఫటాఫట్ గా నిర్ణయాలు తీసుకునే మోదీ, షా ఇప్పుడు తదుపరి జాతీయ అధ్యక్షుడి నియామకం విషయంలో మాత్రం తేల్చుకోలేకపోతున్నారు.
ఉత్తరాదికా ? దక్షిణాదికా ?
బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేసుకోవడానికి అనేక సమీకరణాలు చూసుకోవాల్సి ఉంటుంది. దేశంలోఇతర ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలా లేకపోతే అక్కడ బలం లేదు కాబట్టి అధ్యక్షుడిగా హిందీ వాళ్లనే నియమించుకోవాలా అన్న సందేహం ఉంది. బీజేపీకి దక్షిణాది నుంచి అధ్యక్ష స్థాయి అభ్యర్థులు లేరు. వెంకయ్యనాయుడు రిటైర్మెంట్ అయిన తర్వాత కిషన్ రెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు. ఆయనను జాతీయ అధ్యక్షుడిగా చేస్తే బీజేపీకి పలుకుబడి పెరుగుతుందా.. తగ్గుతుందా అన్నది అంచనా వేయడం కష్టం. ఉత్తరాది నుంచి అయినా.. బీజేపీ అధ్యక్షుడు అనే పవర్ ఫుల్ రోల్ లో ఇమిడిపోయేవారు తక్కువ మంది ఉన్నారు. కానీ అలాంటి పవర్ .. మోదీ, షాలకు ఇష్టం ఉండదు.
పదుల సంఖ్యలో పేర్లు ప్రచారం లోకి !
పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని చేయాలన్నది మోదీ, షాల ఇష్టం . వారు ఎంపిక చేసుకున్న పేరును ప్రకటిస్తారు. అందరూ ఆమోదిస్తారు. అది బహిరంగ రహస్యం. అయితే వీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో పార్టీ నేతలకు అంతు చిక్కడం లేదు. అందుకే రామ్ మాధవ్ నుంచి అన్నామలై వరకూ అందరి పేర్లు ప్రచారం లోకి వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన పేరుతో రాజకీయం చేస్తోంది కాబట్టి కౌంటర్ గా తమ పార్టీ అధ్యక్షుడిగా బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఆ వర్గంలోనూ విచిత్రంగా లక్ష్మణ్, బండి సంజయ్ వంటి పేర్లు ప్రచారంలోకి తెచ్చేశారు.
ఎవరు అధ్యక్షుడు అయినా అమిత్ షానే వర్కింగ్ ప్రెసిడెంట్
ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ కు చెందిన జేపీ నడ్డా అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ ఆయన నిర్ణయాలు తీసుకోలేరు. మోదీ, అమిత్ షాల నిర్ణయాల ప్రకారమే పార్టీ నడుస్తుంది. వారి నిర్ణయాలను నడ్డా అమలు చేస్తారు. కాస్త పలుకుబడి ఉన్న నేతను అధ్యక్షుడిగా నియమిస్తే సొంత నిర్ణయాలు తీసుకుంటారు. అది వారికి ఇష్టం ఉండదు. అందుకే పెద్దగా ప్రజాదరణ లేని…మాస్ ఫాలోయింగ్ లేని..కుల సమీకరణాల్లో భాగంగానే అధ్యక్షుడ్ని నియమిస్తారని సులువుగా అంచనా వేయవచ్చు. అది ఎప్పుడన్నదే సస్పెన్స్ గా మారింది.