తెలంగాణలో కేసీఆర్ రెండోసారి అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరిలో నారాయణపూర్, ములుగు జిల్లాలను ప్రకటించారు. కలెక్టర్లు, ఎస్పీలను నియమించారు. ఈ రెండు జిల్లాలను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చితేనే పరిపూర్ణం అయినట్లు. అలా చేస్తేనే కొత్త జోనల్ వ్యవస్థలో పరిగణనలోకి వస్తాయి. కొత్త జిల్లాలుగా అమలులోకి రాగానే వీటిని కూడా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చాలని కోరుతూ కేంద్ర హోం శాఖకు ప్రతిపాదనలు పంపారు. కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వ సవరణ ప్రతిపాదనలను రాష్ట్రపతికి పంపి సవరణ కోరాలి. సవరణ ప్రతిపాదనలు కేంద్రానికి చేరి ఆరు నెలలవుతోంది. కానీ ఇంతవరకు రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ చేయలేదు.
కొత్త జిల్లాలను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చాల్సిన ప్రతిపాదనలు కేంద్రం వద్ద ఉన్నాయో.. రాష్ట్రపతి వద్ద ఉన్నాయో తెలంగాణ సర్కార్ కు కూడా తెలియడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జోనల్ వ్యవస్థ రద్దు చేస్తూ తెలంగాణా ప్రభుత్వం తీసుకొచ్చిన జోనల్ విధానానికి ఆఘమేఘాల మీద నెల రోజుల్లోనే రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. నిజానికి ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది సవరణపైనే. చిన్న, చిన్న సవరణలు వెంట, వెంటనే అయిపోతుంటాయి. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. రాష్ట్రానికి సహకరించే యోచనలో కేంద్రం లేదని అందుకే రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలకు ఆమోదముద్ర పడటం లేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
గత వారం.. వికారాబాద్ ను చార్మినార్ జోన్ లో కలిపేలా ఉత్తర్వులు జారీ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఇది ఎన్నికల్లో ఇచ్చిన హామీ. అయితే దీనికి కూడా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడితేనే పరిష్కారం అవుతుందని .. ..లేదంటే సవరణలకు ఇప్పట్లో మోక్షం లేనట్లేనన్న భావన వ్యక్తమవుతోంది. మోడీ రెండోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత సీఎం కేసీఆర్ ఇంతవరకు కలవలేదు. కలిసే అవకాశం వచ్చినా ఎవాయిడ్ చేశారు. ఆ ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది.