ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ, కేంద్రంలోని అధికార భాజపాకి మధ్యా దోస్తీ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఆ దోస్తీ ఎంత పటుత్వమైనదో కూడా ఓపెన్ సీక్రెట్..! రెండు పార్టీల మధ్యా ఉన్నది కేవలం నామమాత్రపు పొత్తు అని మాత్రమే చెప్పుకోవాలి. ప్రధాని మోడీకి చంద్రబాబుపై అంతగా నమ్మకం ఉండదనే విమర్శ రెగ్యులర్‌గా వినిపిస్తూనే ఉంటుంది! ఎందుకంటే, చంద్రబాబుకు కేంద్రంలో ఏమాత్రం పెత్తనం ఇచ్చినా.. ఏకు మేకు అయ్యే ప్రమాదం ఉంటుందని మోడీకి తెలియంది కాదు. అందుకే, ఎప్పటికప్పుడు ఏపీ సీఎంకు కళ్లెం వేసి, ఉచ్చు బిగించి ఉంచుతారని చెప్పాలి! భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై ముందు జాగ్రత్త చర్యో తెలీదుగానీ.. చంద్రబాబుకు సంబంధించిన కొన్ని అంశాలపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇంతకీ, ఇప్పుడు చంద్రబాబుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందీ అంటే… ఐదు రాష్ట్రాల ఎన్నికలు! ఈ ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా భాజపా గుత్తాధిపత్యానికి చెక్ పడే అవకాశాలూ లేకపోలేదు. ఒకవేళ అదే జరిగే.. దేశంలోని కాంగ్రెసేతర శక్తులన్నీ ఒక గూటి కిందికి వచ్చే అవకాశం ఉందన్నది విశ్లేషకుల అంచనా. అలాంటి శక్తులూ, వ్యక్తులను ఏకం చేయగలగే చతురత ఉన్న నాయకుడు ఎవరయ్యా అంటే… చంద్రబాబు అనేది భాజపా అంచనా. కేంద్రంలో చక్రం తిప్పగలిగే అవకాశం వస్తే.. దాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఆయన సిద్ధంగా ఉంటారన్నది వేరే చెప్పాలా!
చంద్రబాబు ఇప్పటికే మమత బెనర్జీ వంటివారితో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటారు. పొరుగు రాష్ట్రం తెలంగాణతో తరకారు ఉన్నా… కేసీఆర్‌తో దోస్తానా కంటిన్యూ చేస్తున్నారు. మరోపక్క శరత్ పవార్ వంటివారితో కేసీఆర్‌కు ఫ్రెండ్షిప్ బాగుంది. తమిళనాడులో భాజపా పప్పులు ఉడకలేదు. అక్కడి పరిణామాలు ఇప్పట్టో భాజపాకి అనుకూలంగా మారేట్టు లేవు. ఇవన్నీ విడివిడిగా ఆయా రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలే అయినా… కామన్ థ్రెండ్ ఏంటంటే, మోడీ మోచేతికింద నిలవడానికి ఇష్టం లేని నాయకత్వాలు ఇవన్నీ! సో.. ఇవన్నీ ఒక చోటికి చేర్చే సమర్థత చంద్రబాబుకు ఉందనేది మోడీ అంచనాగా తెలుస్తోంది.
అందుకే, చంద్రబాబు విషయంలో ఆయన అడిగినవన్నీ ఇచ్చేయకుండా కంట్రోల్లో ఉంచుతోందనే చెప్పాలి. ఏపీకి ప్రత్యేక హోదా కావొచ్చు, ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కావొచ్చు… కేంద్రం ఆధిపత్య ధోరణే కనిపిస్తోంది. తాజాగా ఓటుకు నోటుకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన ఫైల్స్‌ను ప్రధాని మోడీ తెప్పించుకున్నట్టు వినికిడి! ఈ వివరాలను తెలుగు రాష్ట్రాల గవర్నర్ స్వయంగా ఢిల్లీకి చేరవేశారనీ అంటున్నారు. దీంతో పాటు ఇంకా ఏవో కీలక సమాచారాలు కూడా రప్పించుకున్నారట. మొత్తానికి, చంద్రబాబు విషయంలో మోడీ ఏదో వ్యూహంతోనే ఉన్నారన్న సంకేతాలు వ్యక్తమౌతున్నాయి.