వాషింగ్టన్ నగరంలో అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా నేతృత్వంలో జరుగుతున్న అంతర్జాతీయ అణుభద్రత సమావేశంలో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోడి సభ్యులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “అణు ఉగ్రవాదం గురించి మాట్లాడేముందు మనం దాని నివారణ, విచారణ గురించి చాలా స్పష్టంగా మాట్లాడుకోవలసి ఉంటుంది. అప్పుడే మనం ఆశించిన ఫలితాలు కనబడుతాయి. ప్రస్తుతం ఉగ్రవాదం తీరు తెన్నులు కూడా చాలా మారాయి. మనం ముఖ్యంగా మూడు విషయాలు గుర్తుంచుకోవాలి. 1. ఉగ్రవాదులు చాలా కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. 2. వాళ్ళు ఇదివరకులాగ ఎక్కడో గుహలలో దాక్కోవడం లేదు. వాళ్ళు మనమధ్యనే తిరుగుతూ సెల్ ఫోన్స్, ల్యాప్ టాప్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ విద్వంసం సృష్టిస్తున్నారు. కానీ వాళ్ళని కనిపెట్టి పట్టుకొనేందుకు మనం మాత్రం ఇంకా పాతకాలం నాటి పద్ధతులనే పాటిస్తున్నాము. 3. వివిధ దేశాలలో ఉగ్రవాదులకు, అణుధార్మిక పదార్ధాలను అక్రమంగా సరఫరా చేసేవారికి కొందరు వ్యక్తులు రహస్యంగా అందిస్తున్న సహాయసహకారాలు చాలా ప్రమాదకరంగా మారాయి. దానిని మనం అడ్డుకోవలసి ఉంటుంది,” అని చెప్పారు.
“ఉగ్రవాదులలో మీ ఉగ్రవాదులు, మా ఉగ్రవాదులని వేరేగా ఉండరు. ఉగ్రవాదులు ఎవరయినా ఒక్కటే. ఉగ్రవాదం అందరికీ సంబంధించిన సమస్య. వాళ్ళ ఉగ్రవాదులతో మాకు హాని ఉండబోదని అనుకోవడం సరికాదు. మొన్న బ్రసెల్స్ నగరంలో ఏమయిందో అందరూ చూసారు. కనుక అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా సూచిస్తున్న విధంగా ప్రపంచంలో అన్ని దేశాలు కలిసి ఉగ్రవాదంపై పోరును కొనసాగించాల్సి ఉంటుంది. అప్పుడే దానికి అడ్డుకోగలము,” అని ప్రధాని నరేంద్ర మోడి అన్నారు.