బీహార్లో తాడో పేడో తేల్చుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధమయ్యారు. ఢిల్లీ ఫలితం పునరావృతం కాకుండా చూడటానిని పత్రయపడుతున్నారు. మంగళవారం భాగల్పూర్ సభలో ఆయన చేసిన ప్రసంగం, ఈ విషయం స్పష్టం చేస్తోంది. మొన్న పాట్నా స్వాభిమాన్ ర్యాలీలో లాలు, నితీష్, సోనియా గాంధీలు మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మోడీ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. దీనికి మోడీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
తాను లోక్ సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రోగ్రెస్ రిపోర్ట్ అడగటానికి ఇవి లోక్ సభ ఎన్నికలు కాదు అసెంబ్లీ ఎన్నికలని గుర్తు చేశారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తన పనితీరు గురించి ప్రజలకు ప్రోగ్రెస్ రిపోర్టు ఇవ్వాలని చెప్పారు. తద్వారా, ఎన్నికల ప్రచారంలో కేంద్రం గురించి కాకుండా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించే చర్చ జరగాలన్న ఎజెండాను ఫిక్స్ చేశారు. 2015లో ప్రతి ఊరికీ విద్యుత్ సరఫరా చేయకపోతే ఓటు అడగనని అప్పట్లో నితీష్ కుమార్ శపథం చేశారు. ఇప్పుడు దాని గురించే మోడీ ప్రశ్నిస్తున్నారు. అన్న మాట ప్రకారం ప్రతి ఊరికీ కరెంటు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇప్పటికీ బీహార్ లో చాలా గ్రామాలకు కరెంటు సరఫరా జరగడం లేదు. అలాంటప్పుడు నితీష్ ఓటు ఎలా అడుగుతారని నిలదీయండి అంటూ బీహార్ ప్రజలకు పిలుపునిచ్చారు.
బీహార్లో ఇప్పటికీ చాలా గ్రామాలకు సరైన రోడ్లు లేవు. ఇతర మౌలిక సదుపాయాలు లేవు. నిరుద్యోగం పెరుగుతోంది. ఉపాధి అవకాశాలు పెరగడం లేదు. పాతికేళ్లుగా లాలు, నితీష్ జమానాలో బీహార్ ను ఏం ఉద్ధరించారని మోడీ ఘాటుగా ప్రశ్నించారు. ప్రజలను ఆలోచింపచేయడానికి ప్రయత్నించారు. ప్రత్యర్థులపై ఊరికే విమర్శలు చేయడం కాకుండా ఇలా పాయింట్ల వారీగా ఎదురు దాడి చేయడం కొత్త వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తానికి ప్రత్యర్థులను డిఫెన్స్ లోకి నెట్టడానికి మోడీ ప్రయత్నించారు.