బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ప్రధాని మోదీ గంట సమయం కేటాయించరు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సావధానంగా గంట సేపు సమావేశం అయ్యారు. అన్ని విషయాలు మాట్లాడారు. రేవంత్ చెప్పింది వినడమే కాదు..తాను కూడా చెప్పారు. తెలంగాణ తరపున పెండింగ్ లో ఉన్న అంశాల గురించీ చర్చించారు. ఈ భేటీ రాష్ట్ర ప్రయోజనాల వరకూ బాగానే ఉంటుంది. కానీ రాజకీయంగా ఆలోచిస్తే ఇది సరైన సమయమేనా అన్న సందేహం కాంగ్రెస్ వర్గాలకే వస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముందు రోజు మోదీ అపాయింట్మెంట్ ఇచ్చారు. అది పోలింగ్ పై ప్రభావం చూపుతుందా లేదా అన్న దాన్ని పక్కన పెడితే.. రేవంత్ ను వ్యూహాత్మకంగా బలహీనం చేయడానికి చేసిన ప్రయత్నం అని కూడా అనుకోవచ్చు. రేవంత్ తో పాటు మంత్రి శ్రీధర్ బాబు ఉన్నప్పటికీ.. అందరూ రేవంత్ సమావేశం అన్నట్లుగానే చూస్తారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రితో సమావేశం కావడం పెద్ద విషయం కాదు. కానీ తెలంగాణ విషయంలో మాత్రం కొన్ని సందేహాలు వస్తాయి. అదే సమయంలో కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ..కేంద్ర మంత్రి అమిత్ షాతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంతో ఆయనపైనా ప్రచారం ప్రారంభమయింది. అయితే అలాంటి ఆలోచన లేదని.. బీజేపీకి దగ్గరవుతున్నాననేది తప్పుడు ప్రచారమని ఆయన ఖండించారు.
రేవంత్ పై హైకమండ్ అసంతృప్తిగా ఉందన్న ప్రచారం ఉంది. ఇటీవల రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో సమావేశమైనా ఆ ఫోటోలు బయటకు రాలేదు. హైకమాండ్ తో ఆయనకు ఉన్న గ్యాప్ ను బీజేపీ మరింత వ్యూహాత్మకంగా పెంచుతోంది. ప్రధాని అపాయింట్మెంట్ ఇచ్చాక వెళ్లలేని పరిస్థితి రేవంత్ రెడ్డి. ఈ రాజకీయాన్ని ఆయన ఎలా ఎదుర్కొంటారో ?