ఆత్మాభిమానం, ఆత్మ గౌరవ నినాదాలతో కాంగ్రెస్ కంచుకోటను తుత్తునియలు చేసి, అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం పార్టీలో ఏం జరుగుతోంది? 2004 నుంచి 2014 వరకూ అధికారానికి దూరంగా ఉన్న సమయంలో చూపిన తెగువ ఇప్పుడేమైంది? చంద్రబాబు వ్యూహ చతురత, ఆయన అమ్ముల పొదిలోని శస్త్రాస్త్రాలూ ఉన్నట్టుండి నిర్వీర్యమైపోయినట్లు ఎందుకు అనిపిస్తున్నాయి. ఆయన అమెరికా పర్యటనకు పెట్టుకున్న ముహూర్తం బాగోలేదా? అంతర్గత విభేదాలే కొంప ముంచుతున్నాయా? క్లిష్టమైన సమస్యలనుంచి చాతుర్యంగా తప్పుకున్న ఆయన మోడీ రచించిన చక్రబంధంలో ఇరుక్కున్నట్లేనా? చంద్రబాబుకు గురుతుల్యుడైన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వారం రోజులుగా ఎందుకు నోరు మెదపడం లేదు? స్వర్ణభారతి ట్రస్ట్ కార్యకలాపాలే లోకంగా గత రెండు రోజులుగా ఎందుకు గడుపుతున్నారు? బెజవాడలో తలపెట్టిన బీజేపీ సభపై వెంకయ్య ముద్ర లేదా? అమిత్ షా వస్తుంటే.. సభ ఏర్పాట్లను తెర వెనకనుంచైనా వెంకయ్య పరిశీలిస్తున్న జాడలు కనిపించడం లేదు. ఇవన్నీ బేరీజు వేసుకుంటుంటే ఏపీ ముఖ్యమంత్రి సారధ్యంలోని టీడీపీని వదిలించుకునేందుకు కేంద్రంలో ఏదో పెద్ద ప్రణాళికే రచించినట్లు కనిపిస్తోంది. ఎన్నికలు రెండేళ్ళుండగానే తన వ్యూహాన్ని నరేంద్ర మోడీ అమలు చేయడం ప్రారంభించేశారంటున్నారు.
సొంత పార్టీ నుంచి కూడా ప్రస్తుతం చంద్రబాబు తలనొప్పులు ఎదుర్కొంటున్నారు. నంద్యాల ఉప ఎన్నికకు అభ్యర్థి ఎంపిక ఇబ్బంది నుంచి బయటపడినట్టే కనిపిస్తున్న చంద్రబాబుకు తాజాగా వైయస్ఆర్ కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే గొట్టిముక్కల రవికుమార్‌తో పెద్ద తలపోటే ఎదురైంది. ఆయన వర్గీయులు కరణం బలరాం వర్గీయులిద్దరిని దారుణంగా నరికి చంపేసిన ఉదంతం ఇప్పుడు పార్టీలో ఉడుకుతోంది. కరణం బలరాం దీనిపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. గొట్టిముక్కల పార్టీలో పునః ప్రవేశించడంతో తన ప్రాధాన్యత తగ్గిపోయిందని భావిస్తున్న కరణం.. పార్టీ అధిష్టానాన్ని ఇరుకున పెట్టడానికి సమయం కోసం కాచుకునే ఉంటారు. వస్తే వదలరు కదా. ఈ వివాదం ఎలా తీరుతుందో చూడాల్సిందే.
మరోవంక ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి ప్రాధాన్యత తగ్గిపోతోందని వినిపిస్తోంది. భూకేటాయింపుల కమిటీలో రెవెన్యూ మంత్రి కూడా అయిన కేఈకి స్థానం కల్పించకపోవడం, ఆయనకు ఏ జిల్లా బాధ్యతలూ అప్పగించకపోవడం, జిల్లా బాధ్యతలను దేవినేని ఉమకు ఇవ్వడం వంటివి కేఈలో అసంతృప్తి జ్వాలలను రగిలిస్తున్నాయి. కానీ, కేఈ అంత తేలిగ్గా బయటపడరు. సమయం చూసి, వాత పెడతారు. అలాగని పార్టీని వీడరు. వీడేవారే అయితే..ఎప్పుడో తట్ట సర్దుకుని ఉండేవారు.
విజయవాడలో మరొక తలనొప్పి.. 13 ఏళ్ళ చిన్నారి సాయిశ్రీ మరణం పార్టీకి చుట్టుకోకుండా చూసుకోవడం. సాయిశ్రీ తండ్రి మాదంశెట్టి శివకుమార్ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు అనుచరుడు. క్యాన్సర్‌తో బాధపడుతున్న సాయిశ్రీని కాపాడుకునేందుకు ఇల్లు అమ్మకుండా అడ్డుపడ్డారనేది ఆరోపణ. సాయిశ్రీ తల్లి సుమశ్రీ ఈ ఆరోపణాస్త్రాన్ని సంధించారు. కాల్‌మనీ కేసులో శివకుమార్ అరెస్టయ్యి బయటకొచ్చారు. ఇప్పుడెక్కడున్నదీ తెలియడం లేదు. దీన్ని చల్లార్చేందుకు సుమశ్రీకి 10 లక్షలు ఇస్తామని చెబుతున్నట్లు తెలుస్తోంది.
ఎప్పుడెప్పుడు చంద్రబాబు తమ చేతికి చిక్కుతారా అని ఎదురుచూసే తెలంగాణ ప్రభుత్వానికి మరో ఆయుధం విదేశీ మద్యం రూపంలో దొరికింది. ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఓ కస్టమ్స్ ఉద్యోగి పెద్దమొత్తంలో విదేశీ మద్యాన్ని తీసుకొస్తూ శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. వెంటనే కస్టమ్స్ కమిషనర్ అకున్ సబర్వాల్ రంగంలోకి దిగారు. ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి ఆ ఉద్యోగిని వదిలేయాల్సిందిగా కోరారనీ, అన్ని ఆధారాలున్నందున విడిచిపెట్టలేమని సబర్వాల్ స్పష్టంచేశారని అంటున్నారు. ఇది ఎన్టీవీ కథనం. సబర్వాల్‌పై ఒత్తిడి తెచ్చింది మంత్రి గంటా శ్రీనివాసరావని సాక్షి పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ నెలలో నిర్వహించే టీడీపీ మహానాడుకు హాజరయ్యేవారికి ఇచ్చేందుకు వీటిని రప్పిస్తున్నారంటూ మరో రాయినీ విసిరింది. ఎన్నో క్లిష్ట పరిస్థితుల్ని అలవోకగా అధిగమించిన చంద్రబాబుకు ఇవేవీ పెద్ద విషయాలు కాదు. బీజేపీతో పొత్తును ఆయనే తెంచేసుకోవాలనుకుంటున్నారంటున్నారు. రహస్యంగా వ్యూహాలను అమలుచేయడంలో దిట్టయిన చంద్రబాబు ప్రణాళికను కమలదళం ముందే కనిపెట్టేసింది. అందుకే వెంకయ్య సైలెంటయిపోయుండవచ్చు. ఎందుకంటే తన ఉనికిని ఆయన కోల్పోలేరు కదా. అదీ నరేంద్ర మోడీని ఢీకొనడమంటే.. కొండను పొట్టేలు ఢీకొట్టడమేననే విషయం ముప్పవరపు వెంకయ్యనాయుడుకు బాగా తెలుసు. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలకు ఇంకొంత కాలం ఆగక తప్పదు.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి