ఈవీఎంల అవకతవకలు, ఎన్నికల నిర్వహణ తీరుపై… టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎన్నికల సంఘంపై తీవ్రమైన విమర్శలే చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబును… విపక్షాలను.. ప్రధాని నరేంద్రమోడీ తప్పు పడుతున్నారు. ఆడలేకే… అంపైర్‌ను అంటున్నారని.. అంటున్నారు. ఇందులో ఎంత నిజం ఉంది..?
” అంపైర్ ఈసీ ” బీజేపీ ఎక్స్ట్రా ప్లేయర్ ..?
ఎన్నికల సంఘానికి అంపైర్ పాత్ర. అందరూ న్యాయబద్ధంగా ఆడేలా చూడాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలి. అంతే కానీ.. తనకు అంపైర్ పోస్టు ఇచ్చారని.. ఓ టీం ..నోబాల్స్ వేసినా… హిట్ వికెట్ అయినా.. చివరికి క్లీన్ బౌల్డ్ అయినా.. చర్యలు తీసుకోకుండా .. మరో టీం… చిన్న తప్పు చేసినా.. తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటూ… ఉంటే… అది నిష్పాక్షికంగా జరిగే మ్యాచ్ ఎలా అవుతుంది. ఇప్పుడు ఇండియాలో ఈ తరహా మ్యాచ్ జరుగుతోంది. బీజేపీకి ఏ నిబంధనలూ అమలు కావట్లేదు. విపక్ష పార్టీలకు మాత్రం… గీత దాటితే కొరడా దెబ్బలు పడుతున్నాయి. అదే విషయాన్ని చంద్రబాబు నేతృత్వంలోని విపక్ష పార్టీలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం… ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్‌గా జరగాలంటే… అధికారంలో ఉన్న వాళ్లకు కొన్ని పరమితులు పెట్టేందుకు చేసిన ఏర్పాటు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. అంపైర్ పాత్రలో ఉండే ఎన్నికల సంఘం.. దీని ఆధారంగా అందర్నీ సమానంగా చూడాలి. ఈ కోడ్ కి పార్టీలు, లీడర్లు, అధికారహోదాలతో సంబంధం ఉండదు. అందరికీ ఒక్కటే.
లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏది..? విపక్ష పార్టీలపై అంత వివక్ష ఎందుకు..?
ఎన్నికల నిబంధనలు అమలు చేసే అంపైరింగ్ వ్యవస్థ దగ్గరే అసలు సమస్య వస్తోంది. కోడ్ ఉండగా ప్రధాని కేబినెట్ భేటీలు నిర్వహిస్తారు..! నిర్ణయాలు తీసుకుంటారు..!. కానీ విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం కోడ్ కఠినంగా అమలవుతుంది. ఎంతగా అంటే.. కేంద్ర పాలన నడిచిపోతుంది. కేంద్రానికి కోడ్ ఉంటే.. రాష్ట్రంలోనూ అధికారాలు వచ్చేసినట్లుగా పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పక్షపాతం లేకుండా.. ఎన్నికలు నిర్వహిస్తామని.. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన… రాజ్యాంగ సంస్థ తీసుకున్న నిర్ణయాలు అత్యంత వివాదాస్పదంగా ఉంటున్నాయి. అందర్నీ సమానంగా చూడటం లేదని.. నిర్ణయాలే వెల్లడిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పని చేయడం ఈసీ విధినా..?. లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏర్పాటు చేయలేకపోవడం ఈసీ వైఫల్యం కాదా..?
ప్రజలు పాల్గొంటున్న మ్యాచ్‌లో ఇంత నిబంధనల ఉల్లంఘనా..?
ఈవీఎంల అవకతవకలు, వీవీ ప్యాట్ల లెక్కిపుపై…అనుమానాలు లెవనెత్తుతున్న విపక్ష పార్టీలది… ఓటమి భయం రాజకీయమని.. మోదీ సహా.. బీజేపీ నేతలందరూ అంటున్నారు. మరి ప్రజలకు వచ్చిన అనుమానాలను ఎవరు నివృతి చేస్తారో మాత్రం చెప్పడం లేదు. బీజేపీ గెలిస్తే ఈవీఎంల అక్రమాల వల్లే అని జనం నమ్మే పరిస్థితి ఉన్నా ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. ఎన్నికల్లో పారదర్శకత అవసరం లేదనే పరిస్థితిని మోదీ తీసుకు వస్తున్నారు. దీనికి ఈసీ వంత పాడుతోంది. దీని వల్ల దేశానికి ఎంత నష్టమో… తెలిసినా కూడా తెలియనట్లే నటిస్తున్నారు.