తెలంగాణ పర్యటనకు వచ్చిన నరేంద్రమోడీ కేసీఆర్ నమ్మకాలపై సెటైర్లు వేశారు. తాను మూఢనమ్మకాలను నమ్మి పనులు చేయబోనని.. తాను టెక్నాలజీని నమ్ముతానన్నారు. ఐఎస్బీ ఇరవయ్యో వార్షికోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన ఎయిర్పోర్టులో బీజేపీ కార్యకర్తలనుద్దేసించి మాట్లాడారు. తనకు టెక్నాలజీ పైన అపారమైన నమ్మకం ఉంన్నారు. అంధవిశ్వాసులతో తెలంగాణకు ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలగాలని.. 2024లో విముక్తి కలుగుతుందనే నమ్మకం తనకుందని ప్రకటించారు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లోనే జరగాల్సి ఉంది. తాము పారిపోయే వాళ్లం కాదు, పోరాడే వాళ్లం.. భాజపా కార్యకర్తలు తగ్గే వాళ్లు కాదు, నెగ్గే వాళ్లని ప్రకటించారు. తెలంగాణలో కుటుంబ పాలన అంతా అవినీతిమయం అయిందని ఆరోపించారు.
తాను తెలంగాణకు ఎప్పుడు వచ్చినా అపూర్వ స్వాగతం పలుకుతున్నారని.. తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలకు కృతజ్ఞతలని మోదీ తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ కార్యకర్తలు కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో వేల మంది అమరులయ్యారు.. ఒక ఆశయం కోసం వేల మంది ప్రాణత్యాగాలు చేశారు.. అమరుల ఆశయాలు తెలంగాణలో నెరవేరటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయ్యిందని.. నిరంకుశ తెలంగాణలో ఎవరి ఆశయాలు నెరవేరటం లేదన్నారు. కుటుంబ పార్టీలను తరిమిస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది.. తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని మోదీ హామీ ఇచ్చారు.
మోదీ రాక సందర్భంగా టీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో గో బ్యాక్ మోదీ హ్యాష్ ట్యాగ్ వైరల్చేశారు. ఆఫ్లైన్లో మోదీకి వ్యతిరేకంగా తమ ప్రచారం చేశారు. నగరంలో చాలా చోట్ల.. విభజన హామీలు.. తెలంగాణకు రావాల్సిన నిధులు.. ప్రాజెక్టుల గురించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. మోదీ వచ్చింది అధికారిక పర్యటనకు. ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు పెట్టుకోలేదు.