ఐదు దేశాల కూటమి బ్రిక్స్ ఎనిమిదో సదస్సు పలు ఆసక్తికరమైన సన్నివేశాలకు వేదికైంది. పాత మిత్రదేశం రష్యా కొత్త శత్రువు ఉగ్రవాదంపై పోరులో భారత్ కు బేషరతు మద్దతు ప్రకటించింది. ఆదివారం బ్రిక్స్ సదస్సు డిక్లరేషన్ లో ఉగ్రవాదమే ప్రధాన ఎజెండా కాబోతుంది.
కొత్త శత్రువైన ఉగ్రవాదంపై పోరాటానికి పాత మిత్రులు చేతులు కలిపారు. ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు గోవాలో జరిపిన చర్చలు సత్ఫలితాన్నిచ్చాయి. భారత్ కు పుతిన్ బేషరతు మద్దతు ప్రకటించారు. చైనా ద్వారా రష్యాకు దగ్గర కావాలని ప్రయత్నించిన పాకిస్తాన్ కు ఇది మింగుడు పడని విషయం. అలాగే, గోవాలో భారత్, రష్యాల మధ్య 16 ఒప్పందాలు కుదిరాయి.
భారత్, రష్యా మధ్య 39 వేల కోట్ల రూపాయల రక్షణ ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఎస్ 400 క్షిపణి వ్యవస్థ కొనుగోలుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. శత్రుదేశాల యుద్ధ విమానాలను గురిచూసి కూల్చడంలో ఈ వ్యవస్థ అత్యాధునికమైంది. అలాగే యుద్ధ విమానాలను కూల్చే ఆధునిక క్రివాక్ నౌకల కొనుగోలుకూ ఒప్పందం కుదిరింది. వీటిని భారత్ తల్వార్ అని పిలుస్తుంది.
రష్యాతో కలిసి హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెలికాప్టర్ల తయారీ చేపడుతుంది. ఈమేరకు అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా కమోవో 226 టి యుటిలిటీ హెలికాప్టర్లను భారత్ లోనే తయారు చేస్తారు. మొదటి దశలో కనీసం 200 హెలికాప్టర్లను తయారు చేయాలనేది లక్ష్యం.
పుతిన్ తో భేటీ, రష్యాతో ఒప్పందాల తర్వాత మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రతినిధులూ ఇందులో పాల్గొన్నారు. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలతో పాటు పాక్ ఉగ్రవాదం, మసూద్ అజార్ ను టెర్రరిస్టుగా ప్రకటించడం, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపులో భారత్ కు సభ్యత్వం, తీవ్రవాదంపై పోరు ప్రధానాంశంగా ఆదివారం బ్రిక్స్ డిక్లరేషన్ విడుదల చేయడం వంటి అంశాలను చర్చించారు. అయితే డ్రాగన్ చైనా వైఖరిలో మార్పు వస్తుందా లేదా అనేదే తేలాల్సి ఉంది.