ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు మొదలైనట్లే. ఎన్డీయే పక్షాలన్నీ కలిసి తమ నేతగా మోడీని ఎన్నుకున్నట్లు అధికారికంగా ధృవీకరించిన నేపథ్యంలో… రాష్ట్రపతి ప్రమాణస్వీకారానికి పిలుపు రాబోతుంది.
అయితే, ఎన్డీయే మీటింగ్ లో ప్రధాని మోడీ తన ప్రసంగంలో తెలంగాణ, కర్నాటకల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ చర్చకు తెరతీస్తున్నాయి.
కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా… లోక్ సభ ఎన్నికల్లో అక్కడి ప్రజలు బీజేపీకి మద్ధతు పలికారు. మంచి సీట్లు ఇచ్చారు అని పేర్కొన్నారు. గతంలో 4 సీట్లున్న బీజేపీ ఇప్పుడు 8 సీట్లు గెలుచుకుంది. పైగా భారీగా తన ఓటింగ్ పర్సంటేజీని పెంచుకుంది.
నిజానికి… రామమందిరం నిర్మాణం తర్వాత ఉత్తరాధి అక్కున చేర్చుకుంటుంది అని బీజేపీ, మోడీ భావించారు. కానీ స్వయంగా అయోధ్యతో పాటు యూపీలోనే మెజారిటీ సీట్లలో కోత పడింది. కానీ దక్షిణాధి నుండి సీట్లు రావనుకున్న సమయంలో ఏపీలో కూటమి మెజారిటీ సీట్లు రాబట్టుకోవటం, తెలంగాణ-కర్నాటకలో మెరుగైన ఫలితాలు సాధించింది. గతంలో లాగా తక్కువ స్థానాలు వచ్చి ఉంటే బీజేపీ మూడోసారి అధికారం చేపట్టడం ఇబ్బందిగా మారేది.
ఇప్పటికే తెలంగాణ 4 ఎంపీలున్న తమకు 8 వచ్చాయని, ఓటింగ్ పెరిగింది… ఇక అసెంబ్లీలో 88 సీట్లే లక్ష్యం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించిన రెండ్రోజుల్లోనే మోడీ కూడా తెలంగాణను ప్రత్యేకంగా ప్రస్తావించారంటే… తెలంగాణ బీజేపీ టార్గెట్ లో ఉన్నట్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.