బీజేపీతో పొత్తులు పెట్టుకుని పార్టీ ఉనికిని కాపాడుకోవాలని కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని గతంలో కొత్త పలుకులో ప్రకటించిన ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ సారి బీజేపీ అలాంటి అవకాశాల్ని ఇవ్వడం లేదని పరోక్షంగా చెప్పుకొచ్చారు. అంతే కాదు.. బీఆర్ఎస్ పార్టీని ఫినిష్ చేయాలని రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలకూ టాస్క్ ఇచ్చారట. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరవాత మర్యాదపూర్వకంగా ప్రధానిని రేవంత్, భట్టి కలిశారు. ఆ సమయమంలో బీఆర్ఎస్ సంగతి చూడటానికి తన మద్దతు ఉంటుదంని చెప్పారని ఆర్కే అంటున్నారు.
బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడితే బలపడేది బీజేపీనే. అందులో సందేహం లేదు. మరో పార్టీ ప్రత్యామ్నాయంగా లేదు. అయితే బీఆర్ఎస్ ను బలహీనం చేయాలనుకుంటే బీజేపీనే చేయగలదు.. కాంగ్రెస్ నేతల్ని ఎందుకు ఎగదోస్తారన్నది ఇక్కడ కీలకం. తమ చేతికి మట్టి అంటకుండా పార్టీలను నిర్వీర్యం చేయడానికి మోదీ ప్రయత్నిస్తూంటారని ఆర్కే ఉదాహరణలు చెప్పారు. జగన్ రెడ్డిని ప్రయోగించి చీఫ్ జస్టిస్ గా అవ్వాల్సిన ఎన్వీ రమణను ఎలా దారిలోకి తెచ్చుకున్నారో.. చంద్రబాబును కేసుల్లో ఇరికించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారో ఆర్కే చెప్పుకొచ్చారు. అయితే ఆ ప్రయత్నాలన్నీ టీడీపీని బలోపేతం చేశాయని అనుకున్న తర్వాత ఇక ఏపీ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకవడం కన్నా.. తెలంగాణ గురించి ఆలోచించడం బెటరని ఆ పని చేస్తున్నారట.
ఆర్కే చెప్పిన మరో విషయం ఏమిటంటే కేసీఆర్ దగ్గర డబ్బులేవట. లోక్ సభ ఎన్నికలను ఎదుర్కోవడానికి అవసరమై నిధులు కేసీఆర్ దగ్గర లేవట. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అంటున్నారు. ఆర్కే. జాతీయ రాజకీయాలపై ఆశలతో ఇతర రాష్ట్రాల్లోని నేతలకు పంపారట. ఇప్పుడు తనకు సాయం చేసే వారి కోసం ఆయన ఎదురు చూస్తున్నారని అంటున్నారు. బలమైన అభ్యర్థులు లేక… ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. తన కుటుంబసభ్యులెవరూ పార్లమెంట్ కు పోటీ చేయకుండా కట్టడి చేస్తున్నారని కూడా అంటున్నారు. తన పార్టీకి వెయ్యి కోట్ల డిపాజిట్లు ఉన్నాయని కేసీఆర్ ప్రకటించారు. మరి డబ్బుల్లేవని ఆర్కేకు ఎందుకు అనిపించిందో..?
ఈ వారం ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకోబోతున్న షర్మిల గురించి ఆర్కే ఒక్క మాట కూడా రాయలేదు. షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుకలో ఏం జరిగిందో కథలు కథలుగా చెబతారని చాలా మంది భావించారు.. కానీ ఏమీ చెప్పలేదు. బహుశా.. వచ్చే వారం మొత్తం … షర్మిల.. జగన్ ఎపిసోడ్ హైలెట్ చేసే అవకాశం ఉంది.