కొత్త రాష్ట్రం. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం. రాజధాని లేని రాష్ట్రం. కొత్త రాజధాని నిర్మాణానికి తంటాలు పడుతున్న రాష్ట్రం. అలాంటి ఆంధ్ర ప్రదేశ్ కు అండగా ఉండాల్సిన కేంద్రం కాడి వదిలేసినట్టు ప్రవర్తిస్తున్న తీరు దారుణం. రైల్వే బడ్జెట్లో విశాఖ జోన్ ఊసే లేదు. సాధారణ బడ్జెట్లో సరైన కేటాయింపులూ లేవు. పోలవరం ప్రాజెక్టు సహా దేనికీ సరైన విధంగా కేటాయింపులు జరగలేదు. ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లని ఆనాడు రాజ్యసభలో పట్టుబట్టిన వెంకయ్య నాయుడు సాక్షిగా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రెండో సారి ప్రవేశ పెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్లో హోదా గానీ ప్యాకేజీ గానీ పత్తా లేవు. రాజధాని నిర్మాణానికి సాయం చేయాలనే బాధ్యతనూ విస్మరించినట్టు స్పష్టంగా కనిపించింది.
తెలంగాణతో పోలిస్తే ఏపీ పేద రాష్ట్రం. పైగా రాజధాని లేదు. రాజధాని శంకుస్థాపనకు వస్తూ మోడీ డబ్బులమూట తెస్తారని ఆశపడటం సబబు కాకపోవచ్చు. కానీ బడ్జెట్లో అయినా సరైన కేటాయింపులు చేయాలి. కానీ ఆ విషయాన్ని అరుణ్ జైట్లీ పట్టించుకోలేదు. విజయవాడ మెట్రోకు 106 కోట్లు కేటాయించినా నగర ప్రజలకు సంతృప్తి లేదు. పోలవరం ప్రాజెక్టుకు భారీగా కేటాయింపులు జరపాలనే విషయాన్ని కేంద్రం గుర్తించినట్టు లేదు.
ఉన్నత విద్యాసంస్థలకు కాస్త పరవాలేదనే విధంగా నిధులను కేటాయించారు. అసలు రాజధాని నిర్మాణానికి కేంద్రం సహాయం చేస్తుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఛత్తీస్ గఢ్ రాజధాని నయా రాయ్ పూర్ నిర్మాణానికి ఆనాడు కేంద్రం ప్రాథమికంగా 5000 కోట్ల రూపాయలు కేటాయించింది. పదేళ్ల తర్వాత ద్రవ్యోల్బణం పెరిగింది. ఖర్చులు పెరిగాయి. పైగా ఛత్తీస్ గఢ్ కంటే ఏపీ ఎంతో పెద్ద రాష్ట్రం. కాబట్టి పెద్ద రాజధానే అవసరం. దానికి భారీగా నిధులు అవసరం. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉన్న రాష్ట్రంలో ద్రవ్యలోటును పూడ్చాల్సింది కూడా కేంద్రమే. అయినా అరుణ్ జైట్లీ ఈ విషయాలు ఏవీ పట్టించుకోలేదు.
మోడీ జమానాలో కొన్ని సార్లు అనూహ్యంగా వేగంగా స్పందిస్తున్నారు. కొన్ని సార్లు నిమ్మకు నీరెత్తినట్టు గమ్మునుంటున్నారు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారనేది పజిల్ గా మారింది. రెండు సార్లు వరదలతో అతలాకుతలమైన కాశ్మీర్ కు భారీ సహాయం అవసరం. కానీ ఈ విషయంలో మోడీ ప్రభుత్వం తాత్సారం చేసింది. అందుకే లోయలో కేంద్రంపై ఆగ్రహం వ్యక్తమైంది. ఇక, బీహార్ కు ప్యాకేజీ ప్రకటించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. వేలం పాట తరహాలో మోడీ ఆనాడు ప్యాకేజీని ప్రకటించారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే విషయం గ్రహించి ఆచరించే నాయకుల్లో మోడీ ఒకరు. అలాంటిది, బీహార్లో ఆనాటి ప్రకటన తీరుపై అనేక విమర్శలు వచ్చాయి. బహుశా అందుకేనేమో, బీహారీలు ఆ ప్యాకేజీని పట్టించుకోకుండా నితీష్ పాలనకే జైకొట్టారు.
చంద్రబాబు పదే పదే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో పాటు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అవుతున్నారు. విభజన చట్టంలోని హామీలను గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తున్నారు. అయినా ఇలా ఎందుకు జరుగుతోందో మోడీ, అరుణ్ జైట్లీలే జవాబు చెప్పాలి.