ఆంధ్రప్రదేశ్ లో మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని బిజెపి హైకమాండ్ నిర్ణయించింది. ప్రజల సెంటిమెంటుగా మారిపోయిన ‘ ప్రత్యేక హోదా” విషయంలో పార్టీకి జరుగుతున్న నష్టాన్ని నివారించే చర్యల్లో భాగమే ఈ సభలు! కనీసం ఒక సభలో అయినా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉపన్యసించే అవకాశం వుంది.
రాష్ట్రానికి అన్నివిధాలా అందుతున్న సాయం రెండు లక్షల కోట్ల రూపాయలని బిజెపి కేంద్రనాయకులు చెబుతూండగా 70 వేల కోట్లరూపాయలేనని చంద్రబాబు అంటున్నారు. ఎదుటి వారి అంకెలు తప్పని వాదించడానికి ఇద్దరూ సిద్ధంగా లేరు.
తెలుగుదేశం పార్టీకి, బిజెపికి మధ్య సంబంధాలు – విడాకులు తీసుకోడానికి ఇష్టంలేక ఒంటరి బతుకులు గడుపుతున్న దంపతుల మాదిరిగా వున్నాయి. హోదాకంటే ప్యాకేజీ నయమని ప్రకటించేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బిజెపికి రాజకీయ ఇబ్బందులేమీ లేవు. అలాగే పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి కూడా నియమించుకోలేని బిజెపి వల్ల చంద్రబాబుకి కూడా రాజకీయ సమస్యలు లేవు.
అయితే, పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా ప్రస్తావన తీసుకురాగానే ఆయనకు బురద పులిమే పనిని బిజెపి నేరుగా, తెలుగుదేశం పరోక్షంగా మొదలు పెట్టాయి. ప్రత్యేక హోదా విషయంలో బిజెపికి కలుగుతున్న నష్టాన్ని పలు సర్వేలు, నివేదికల ద్వారా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే గుర్తించారు.
ఎపిలో బిజెపికి పెద్దబలం లేకపోయినా, నరేంద్రమోదీ పట్ల గౌరవ అభిమానాలు గట్టిగానే వున్నాయి. రాజధాని నిర్మాణం మొదలైన వ్యవహారాల్లో చంద్రబాబు ధోరణి పట్ల వ్యతిరేకత వున్న ప్రజల మీద బిజెపికి పెద్ద ఆశలే వున్నాయి. ఆ పార్టీ స్టార్ కేంపెయినర్ మోదీ వచ్చి కేంద్రం ఎపికి ఏంచేస్తోందో స్వయంగా చెబితే చాలు! ప్రత్యేక హోదా విషయంలో జరిగిన డామేజి కొంతైనా కంట్రోలు అవుతుందన్నది బిజెపి ఆలోచనగా కనిపిస్తోంది!