ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి రాత్రి ఎనిమిది గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. లాక్డౌన్ పొడిగింపుపై ఆయన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. శనివారం ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరుపుతారు. లాక్ డౌన్ అంశంపై అందరి ఆలోచనలు తెలుసుకుంటారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే.. లాక్ డౌన్ పొడిగింపు ఖాయమన్న సూచనలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పారు ఒడిషా, పంజాబ్ లాంటి రాష్ట్రాలు కేంద్రంతో సంబంధం లేకుండా లాక్ డౌన్ ను పొడిగించాయి కూడా.
అయితే.. లాక్ డౌన్ పొడిగింపు ఖాయమయినప్పటికీ.. కొన్ని మినహాయింపులను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించబోతున్నట్లుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. హాట్ స్పాట్లలో లాక్ డౌన్‌కు ఎలాంటి మినహాయింపు లభించదు. ఇప్పటికే హాట్ స్పాట్లను ప్రకటించారు. వైరస్ వ్యాప్తి తక్కువగా లేదా..అసలు లేని చోట్ల మాత్రం.. మినహాయింపు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పరిమితంగా ప్రజారవాణాను కూడా అనుమతిస్తారని అంటున్నారు. సామాజిక దూరం ఉండేలా టిక్కెట్లు బుకింగ్‌ను ఖరారు చేస్తారని అంటున్నారు మూడు సీట్లకు ఒక్క టిక్కెట్ మాత్రమే అమ్మి ప్రయాణాలు చేసేలా అనుమతించే అవకాశం ఉందంటున్నారు.
ప్రస్తుతం దేశంలో 75 జిల్లాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కేంద్రం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. పద్నాల్గవ తేదీకి… ప్రధానమంత్రి గతంలో ప్రకటించిన మూడు వారాల లాక్ డౌన్ గడువు పూర్తయిపోతుంది. కొత్త లాక్ డౌన్ బుధవారం నుంచి అమలులోకి వస్తోంది, ఆ లాక్ డౌన్ విధి విధానాలు ఏమిటన్నది ఆదివారం సాయంత్రం.. ప్రధానమంత్రి జాతినుద్దేశించి చేసే ప్రసంగంలో ఉండొచ్చంటున్నారు. కరోనా వైరస్ బయటపడిన తర్వాత మోడీ మూడో సారి జాతినుద్దేశించి ప్రసంగించినట్లు అవుతుంది.