ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం తెలంగాణకు వస్తున్నారు. ఈ సందర్భంగా రెండు భారీ బహిరంగ సభలను భాజపా నిర్వహిస్తోంది. మంగళవారం ఉదయాన్నే మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా నిజామాబాద్ వస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు జరిగే సభలో ప్రసంగిస్తారు. ఆ తరువాత, మధ్యాహ్నం రెండున్నరకి మహబూబ్ నగర్ లో జరిగే సభకు హాజరౌతారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి, ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిపోతారు. ఇదీ ఆయన పర్యటన షెడ్యూల్. అయితే, ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణకు వస్తున్న మోడీ… ఇక్కడి ప్రజలకు ఏం చెబుతారు అనేదే కొంత ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలో భాజపా ప్రచారం రెండు అంశాలపైనే నడుస్తోంది. ఒకటీ… నాలుగేళ్ల కేసీఆర్ పాలన వైఫల్యాలు, రెండోది మజ్లిస్ ను ఎదుర్కొనే సత్తా తమకు మాత్రమే ఉందని చెప్పడం. అధ్యక్షుడు అమిత్ షా కూడా ఇవే అంశాలతో ప్రచారం చేశారు. అయితే, ప్రధాని వస్తున్నారు కాబట్టి.. ఆయన కూడా కేసీఆర్ వైఫల్యాలను తీవ్రంగా ఎండగట్టగలరా..? లేదంటే, తూతూ మంత్రంగా.. దళిత ముఖ్యమంత్రి హామీ గురించో, ముస్లింలకు కేసీఆర్ ఇస్తామన్న 12 శాతం రిజర్వేషన్ల గురించో విమర్శించేసి చేతులు దులిపేసుకుంటారో చూడాలి.
తెరాస, భాజపాల మధ్య దోస్తీ ఏంటనేది మోడీ స్పష్టంగా చెప్పరుగానీ, ఆయన ప్రసంగం ద్వారా ఆ బంధం ఏంటనేది స్పష్టమయ్యే అవకాశం ఈ సందర్భంగా ఉంది. తెరాసను ప్రత్యర్థిగానే చూస్తున్నామని అమిత్ షా చెప్తున్నా… ప్రజలకు అది పూర్తిగా నమ్మశక్యం కావడం లేదు. ఎందుకంటే, ముందస్తు ఎన్నికలు మొదలుకొని, కొన్ని కీలక అంశాలపై ఈ మధ్య కేసీఆర్ కి కేంద్రం బాగా సాయపడిందనే అభిప్రాయమే బలంగా ఉంది. ఓరకంగా తెలంగాణలో భాజపాకి అదే ప్రతిబంధకంగా మారింది. అందుకే, ఈ ప్రచార పర్వంలో తెరాస వెర్సెస్ భాజపా నేతలు అనేది ఎక్కడా కనిపించడం లేదు.
ఇంకో ముఖ్యమైన అంశం… తెలంగాణ ప్రజలకు ఏం చెప్పి మోడీ ఓట్లు అడుగుతారు అనేదీ ఆసక్తికరమే. ఎందుకంటే, విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇవ్వాల్సిన ప్రయోజనాలను భాజపా నెరవేర్చలేదు. బయ్యారం స్టీల్ ప్లాంట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, యూనివర్శిటీలు, పరిశ్రమలకు రాయితీలు… ఇలాంటివేవీ కేంద్రం ఇవ్వలేదు. కేసీఆర్ కూడా బలంగా అడగలేదు. మరి, మోడీ తన ప్రసంగంలో వీటి ప్రస్థావన తీసుకొస్తే… ఇవి వైఫల్యాలు అవుతాయి. కాబట్టి, అమిత్ షా మాదిరిగానే అభివృద్ధి మంత్రాన్నే మళ్లీ మళ్లీ వినిపించే అవకాశాలే ఎక్కువ. తెలంగాణకు మోడీ సర్కారు ప్రత్యేకంగా చేసింది చెప్పుకోవడానికి లేదు. పోనీ, చేయబోయేది మోడీ చెబితే… ఇన్నాళ్లూ ప్రధానిగా ఆయన తెలంగాణకు చేసిందేం లేదని ఒప్పుకున్నట్టే అవుతుంది. ఏదేమైనా, ప్రధాని పర్యటనతో కేసీఆర్ తో ఉన్న స్నేహం ఏపాటిదో అనేది స్పష్టత వస్తుందనే చెప్పొచ్చు.