నరేంద్రమోడీ రెండో సారి అధికారం చేపట్టిన తర్వాత.. శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు. పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్న ప్రతీ పార్టీ అధ్యక్షుడ్ని ఆహ్వానించారు. మొత్తం ఐదు అంశాలు ఎజెండాగా చెప్పినప్పటికీ.. అసలు విషయం మాత్రం జమిలీ ఎన్నికలు.
మోడీ ఆలోచనను వ్యతిరేకించే ధైర్యం ఎవరికయినా ఉందా..?
“ఒకే దేశం – ఒకే ఎన్నికలు” అనే నినాదాన్ని భారతీయ జనతా పార్టీ చాలా కాలంగా వినిపిస్తోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సగానికి సగం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిపేసి.. 2024 నాటికి పూర్తి స్థాయిలో… జమిలీ ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నారు. అందు కోసం సాధ్యాసాధ్యాల పరిశీలనకు లా కమిషన్ను కూడా నియమించారు. ఆ కమిషన్ అన్ని పార్టీల దగ్గర్నుంచి అభిప్రాయాలు తీసుకుంది. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే.. ఎదురయ్యే సవాళ్లు..అధిగమించాల్సిన మార్గాలతో నివేదిక సిద్ధం చేసింది. కానీ…అప్పటి రాజకీయ పరిస్థితుల్లో.. బీజేపీని వ్యతిరేకించే ప్రతీ పార్టీ… జమిలీ ఎన్నికలను అంగీకరించలేదు. అందుకే జమిలీ లేకుండానే ఎన్నికలు ముగిశాయి.
గతంలో వ్యతిరేకించిన పార్టీలూ ఇప్పుడు నోరు తెరవలేని పరిస్థితి..!
గతంలో జమిలీ ప్రతిపాదన వచ్చినప్పుడు లా కమిషన్ ముందు… కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ , టీడీపీ, బీఎస్పీ సహా పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే.. ఆయా పార్టీల కారణాలన్నీ రాజకీయ పరమైనవే. బీజేపీ విధానాన్ని సమర్థించే అవకాశం లేని కారణంగా.. కొన్ని పార్టీలు వ్యతిరేకించాయి. ఇప్పుడు… అలాంటి పరిస్థితి లేదు. కొన్ని పార్టీలను జమిలీ ఎన్నికలను స్వాగతించక తప్పని పరిస్థితి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి మోదీతో భేటీకి మూడు ప్రాంతీయ పార్టీలకు ఆహ్వానం లభించింది. టీఆర్ఎస్, వైసీపీ సమావేశానికి వెళ్తున్నాయి. టీడీపీ నుంచి మాత్రం ఎవరూ వెళ్లడం లేదు. మమతా బెనర్జీ కూడా.. సమావేశానికి వెళ్లడం లేదు. ఎన్నికలకు ముందు.. వైసీపీ అధినేత జగన్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జమిలీ ఎన్నికలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. లా కమిషన్కు లిఖితపూర్వకంగా ఈ విషయాన్ని తెలియజేశారు.
మోడీ తల్చుకుంటే “జమిలీ” ఖాయమే..!
ముందస్తు ఎన్నికలు నిర్వహించాలంటే… కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల అధికారసమయాన్ని కుదించాల్సి ఉంది. మరికొన్నింటిలో రాష్ట్రపతి పాలన విధించడమో.. లేదా అధికారాల్ని పొడిగించడమో చేయాలి. పెంచితే సరే అంటారు కానీ..కుదిస్తే మాత్రం.. కొంత మంది అంగీకరించే అవకాశం ఉండదు. కానీ మోదీ పట్టుబడితే.. అంగీకరించకతప్పని పరిస్థితి అధికారంలో ఉన్న కొన్ని పార్టీలకు ఉంది. జేడీయూ, జేడీఎస్, వైసీపీ, టీఆర్ఎస్, అన్నాడీఎంకే, బీజేడి లాంటి పార్టీలు.. తప్పదు.. అని కేంద్రం అంటే.. సరేననక తప్పని పరిస్థితి ప్రస్తుత రాజకీయాల్లో ఉందనేది చాలా మంది చెప్పే మాట.