త్వరలోనే రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. ఆ తరువాత, ఏపీ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ మరింతగా పెరిగేట్టుగానే కనిపిస్తోంది. ఎలా అంటారా… టీడీపీ పెంచుతున్న మాటల యుద్ధానికి భాజపా స్పందన ఉండే అవకాశం స్పష్టంగా ఉంది. విపక్ష నేత జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో టీడీపీ నేతలు ఏ స్థాయిలో విమర్శించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేసులను మాఫీ చేయించుకోడం కోసమే మోడీ కాళ్లు పట్టుకునేందుకు జగన్ వెళ్లారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యాఖ్యాల్ని పీఎంవో కాస్త సీరియస్ గానే తీసుకుందట! ఎందుకంటే, మోడీ కాళ్లు పట్టుకుంటే కేసులు మాఫ్ అయిపోతాయంటే… సీబీఐ, ఈడీ లాంటివి మోడీ ఆడమన్నట్టు ఆడుతున్నాయని చంద్రబాబు విమర్శించినట్టే కదా!
నిజానికి, ఏ కాంగ్రెస్ నాయకుడో ఈ విమర్శ చేసి ఉంటే మోడీ సీరియస్ గా తీసుకునేవారు కాదనీ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, పైగా ఎన్డీయే భాగస్వామి అయిన టీడీపీ అధ్యక్షుడు చేయడాన్ని మోడీ తీవ్రంగా పరిగణించారని భాజపాకి చెందిన ఓ నాయకుడు ఆఫ్ రికార్డు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. గోద్రా అల్లర్ల సమయంలో అప్పట్లో భాజపాని ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్నీ, మోడీపై చేసిన విమర్శల్ని ఎవ్వరూ మరచిపోలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వారే అంటున్నారు! ఇటీవల చంద్రబాబు చేసిన కామెంట్స్ పై భాజపా అంత హర్ట్ అయితే స్పందన ఏదీ… అనేగా అనుమానం. కచ్చితంగా స్పందన ఉంటుందనే ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రపతి ఎన్నిక పూర్తయ్యాక తెలుగుదేశం విషయమై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు భాజపా సిద్ధంగా ఉందని సమాచారం. అందుకే, కాస్త ప్రస్తుతం కాస్త మౌనంగా ఉంటోంది అంటున్నారు!
ఆంధ్రాలో చోటు చేసుకున్న తాజా పరిణామాలన్నింటిపైనా అమిత్ షా కన్నేసినట్టు సమాచారం. ఆంధ్రాలో సాగునీటి ప్రాజెక్టులు, టీడీపీ అమలు చేస్తున్న పథకాల తీరు, వివిధ అంశాలపై టీడీపీ నేతలు ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలు.. ఇలా అన్నిరకాల సమాచారాన్నీ అమిత్ షా రాబడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. వీటన్నింటిపై కేంద్రం నుంచి స్పందన ఉంటుందనీ, చర్యలు ఉండే అవకాశాలు స్పష్టమని అంటున్నారు. ఆ ధీమాతోనే ఏపీ భాజపా నేతలు కూడా ఈ మధ్య కాస్త దూకుడు పెంచారనీ చెబుతున్నారు. తెలంగాణ పర్యటన సందర్భంగా టీడీపీతో పొత్తుపై అమిత్ షా ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చేసినట్టే. ఆంధ్రాలో కొనసాగుతుందని ప్రస్తుతానికి చెబుతున్నా.. రాష్ట్రపతి ఎన్నికల తరువాత చోటు చేసుకునే పరిణామాలు వేరుగా ఉండేట్టుగానే కనిపిస్తున్నాయి. చంద్రబాబు చేసిన విమర్శలకు మోడీ బాగానే హర్ట్ అయ్యారని ఈ మధ్య కథనాలు వచ్చాయి. కానీ, ఆయన స్పందన మాటల్లో కాదూ, చేతల్లో ఈ రేంజిలో ఉండబోతోందని టీడీపీ ఇప్పటికైనా అర్థం చేసుకుంటోందో లేదో..!