హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడి అమెరికాలో జరిపిన పర్యటన బ్రహ్మాండంగా విజయవంతమయిన సంగతి తెలిసిందే. ఆయన గత ఏడాది జరిపిన పర్యటనస్థాయిలోనే తాజా పర్యటనకూడా సక్సెస్ అయింది. న్యూయార్క్‌లో కార్పొరేట్ దిగ్గజాలతో, సిలికాన్‌వ్యాలీలో సాఫ్ట్వేర్ అధినేతలతో ఆయన సమావేశమై ప్రత్యేక చర్చలు జరిపారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. గూగుల్, ఫేస్బుక్ కార్యాలయాలను సందర్శించారు. తన బాల్యంగురించి ఉద్వేగభరితంగా చెబుతూ కంటనీరు పెట్టుకున్నారు. శాన్‌జోస్ సెంటర్లో తమ ప్రభుత్వ విజయాలను ఏకరవు పెడుతూ ఎన్ఆర్ఐలను మంత్రముగ్ధులను చేశారు. ఈ శతాబ్దం భారత్‌దేనని, తన దేహం దేశానిదేనని పేర్కొన్నారు. డిజిటల్ ఇండియాలో పాలుపంచుకోమని ఆయన ఇచ్చిన పిలుపుకు ప్రతిస్పందిస్తూ అమెరికన్ సాఫ్ట్వేర్ సంస్థలు ముందుకొచ్చాయి(దీనివెనక వారి ప్రయోజనాలుకూడా ఉండటం వేరే విషయం). మరోవైపు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాలని 4జీ సదస్సులో వాదించారు. మొత్తంమీద చూస్తే మోడి పర్యటన విజయవంతమవటంతోబాటు మీడియాలో మోడికి బ్రహ్మాండమైన కవరేజ్ లభించింది. ఇటు ఇండియాలోగానీ అటు విదేశాలలోగానీ ఈ మూడురోజులూ మీడియాలో మోడి పేరు మార్మోగింది. ఇది ఎక్కడదాకా వెెళ్ళిందంటే పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మోడిని చూసి నేర్చుకోవాలని ఆ దేశంలో మీడియా సలహాలు ఇచ్చేంతవరకు.
ఇదిలా ఉంటే, నరేంద్రమోడి అమెరికా పర్యటన బీహార్ ఎన్నికలలో తమకు కలిసొస్తుందని భారతీయ జనతాపార్టీ వర్గాలు సంబరపడుతుండటంతో ఆ పార్టీకి కీలకంగా భావిస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై మోడి పర్యటన ప్రభావం ఎంతమేరకు ఉంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మోడి అమెరికా పర్యటనపై మీడియా కవరేజ్, రెండువారాల్లో జరగబోయే బీహార్ ఎన్నికల్లో బీజేపీకి కలిసొస్తుందనటంలో ఎలాంటి సందేహమూలేదు. మోడి అమెరికా పర్యటన బీహార్ ఎన్నికలకోసం ప్లాన్డ్గా చేసినది కానప్పటికీ బీజేపీకి ఇది అనుకోకుండా కలిసొచ్చిన అంశం. ఆ పార్టీ నాయకులు తమ ఎన్నికల సభలలో మోడి అమెరికా పర్యటనను చూపించి – తమ నాయకుడు దేశ ప్రతిష్ఠను ఎలా దిగంతాలకు వ్యాపింపజేస్తున్నారో గమనించాలని బాకా ఊదకమానరు. మరి ఈ ప్రచార ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేది వేచిచూడాలి.