నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత నుంచీ ఆయన సాధించిన ప్రజలకు ఉపయోగపడే విజయాలు ఏంటి అంటే సమాధానం చెప్పడం కష్టం కానీ రాజకీయ విజయాల గురించి మాత్రం ఎంతైనా చెప్పుకోవచ్చు. అంతకు ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మోడీ రాజకీయ పయనం ఇలానే ఉండేది. ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నాశనం చెయ్యడంతో పాటు బిజెపిలో ఉన్న తన ప్రత్యర్థులను కూడా నోరెత్తకుండా చేయడంలో అద్వితీయ విజయం సాధించాడు మోడీ. 2014 నుంచి ప్రధానమంత్రిగా కూడా అదే పని చేస్తున్నాడు మోడీ. పార్టీకి ప్రాణం పోసిన అద్వానీకి బిజెపిలో కనీస ప్రాధాన్యం కూడా లేకుండా చేసేశాడు. ఇక అద్వానీకి సపోర్ట్‌గా ఉన్న నాయకులందరినీ సైలెంట్ చేసేశాడు. ‘రాజకీయం’ విషయంలో ఎప్పుడో ఆరితేరిపోయిన వెంకయ్యనాయుడులాంటి వాళ్ళు మాత్రం ‘కలియుగ దేవుడు మోడీకి జై’ అని ప్లేట్ మార్చేసి ఉనికిని నిలుపుకుంటున్నారు.
పార్టీలో ఉన్న బలమైన నాయకులను, ప్రతిపక్ష నాయకులను పూర్తిగా అణచడంలో మోడీకి పరిస్థితులు కూడా భలే కలిసొచ్చాయి. అమిత్ షాలాంటి రాజకీయ చాణక్యుడు మోడీకి నమ్మినబంటుగా ఉండడం మోడీకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయింది. అలాగే భారతదేశం ఇప్పటి వరకూ కనీ వినీ ఎరుగని స్థాయి కామెడీ పొలిటీషియన్ రాహుల్ గాంధీ మోడీకి ప్రత్యర్థిగా ఉండడం అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా….చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఇక మోడీని చాలెంజ్ చేసే అవకాశమున్న నాయకులను ఒక్కొక్కళ్ళను బలహీనపరుస్తూ వస్తున్నాడు మోడీ. ఆ ప్రాసెస్‌లోనే ఇప్పుడు అందరికంటే పెద్ద శతృవుగా భావించే కేజ్రీవాల్‌ని దెబ్బకొట్టడంలో సక్సెస్ అయ్యాడు. ఢిల్లీ ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకుని తిరిగినట్టుగా, లోకల్ నాయకుడి స్థాయికి దిగజారి మరీ ప్రచారం చేశాడు మోడీ. అలాంటి మోడీకి కనీ వినీ ఎరుగని ఓటమిని రుచి చూపించాడు కేజ్రీవాల్. ఇక అప్పటి నుంచీ కేజ్రీవాల్‌ని ఇబ్బందిపెట్టడానికి మోడీ వేసిన ఎత్తులు అన్నీ ఇన్నీ కావు. దేశంలో ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్, తమిళనాడు…ఇలా ఎన్నో పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉండగా కనీసం రాష్ట్ర హోదా కూడా లేని ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి జాతీయ మీడియాలో జరిగినంత చర్చ ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? ప్రధానమంత్రి నిర్ణయాల గురించి చర్చించినంతగా ఢిల్లీ ముఖ్యమంత్రి నిర్ణయాల గురించి చర్చోపర్చలు జరిపారు. అన్నీ కూడా దేశంలోనే అత్యంత అసమర్థుడు, అవినీతిపరుడు కేజ్రీవాల్ అని తేల్చినవే. అంతా కూడా పెయిడ్ మీడియా మహిమ. మన తెలుగు నాట కూడా నంబర్ ఒన్ పత్రిక మోడీని సమర్థిస్తూ, కేజ్రీవాల్‌ని విమర్శిస్తూ ఎన్ని రకాలుగా ప్రచారం చేసిందో. ఆ ప్రచారంతో పాటు కేజ్రీవాల్ రాజకీయ అనుభవలేమి, పాలనలో చేసిన తప్పులు కలిసొచ్చి కేజ్రీవాల్‌పై మోడీ విజయం సాధించాడు. ఇక తర్వాత టార్గెట్‌గా మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఉంటారనడంలో సందేహం లేదు. అలాగే తమిళనాడులో బిజెపిని ప్రధాన పార్టీగా నిలబెట్టే ప్రయత్నంలో కూడా విజయం సాధించేలానే ఉన్నాడు. ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడు మోడీ కనుసన్నల్లోనే నడుస్తున్న పరిస్థితి కదా.
మోడీ రాజకీయ విజయాల చరిత్ర గురించి….ప్రస్తుతం మోడీ సాధించిన విజయం గురించి ఆయన భజన మీడియా…..తొంభై శాతం మీడియా అని చెప్పొచ్చేమో….ఓ స్థాయిలో హీరోచిత కథనాలు వండుతుందనడంలో సందేహం లేదు. మరి ప్రజా ప్రయోజనాల మాటేంటి? నోట్ల రద్దు దెబ్బతో మావోయిస్టులనేవాళ్ళ దేశంలో లేకుండా పోయారు అనే రేంజ్లో పార్లమెంట్ సాక్షిగా ప్రగల్భాలు పలికారు. తాజాగా జరిగిన దాడితో వాళ్ళ బలం పెరిగిందో….తగ్గిందో మోడీవారే చెప్పాలి. అలాగే టెర్రరిజం, కాశ్మీర్ సమస్యలు కూడా రోజు రోజుకూ తీవ్రమవుతూనే ఉన్నాయి. ఇక దేశంలో ఉన్న డెబ్భై శాతం జనాల జీవితాల్లో మోడీ ప్రధాని అయిన ఈ మూడేళ్ళ కాలంలో వచ్చిన మార్పేంటో కూడా మోడీనే చెప్పాలి. దేశంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా నిలబడే స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కి మోడీ ఎంత న్యాయం చేస్తున్నాడు? ఎంత ద్రోహం చేస్తున్నాడు అనే విషయం ఒక్కటి ఆలోచిస్తే చాలు……మోడీకి రాజకీయ విజయాల మీద శ్రద్ధ ఉందా? ప్రజా ప్రయోజనాల ఎక్కువ శ్రద్ధ ఉందా అనే విషయం అర్థమవ్వడానికి.