ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించింది. అయితే, ఈ విజయానికి కారణం… ప్రధాని మంత్రి మోడీపై ప్రజల్లో పెరుగుతున్న అపార విశ్వాసమే అని భాజపా ఢంకా బజాయింస్తోంది. ఇది సెమీ ఫైనల్ అన్నట్టుగా యావత్ అనుకూల మీడియా మోడీని మోసేస్తోంది. భారత్ అంటే మోడీ… మోడీ అంటే భారత్ అనేస్తున్నారు. అయితే.. వాస్తవంగా ఆలోచిస్తే ఉత్తరప్రదేశ్లోగానీ, ఉత్తరాంచ్లోగానీ ఇతర రాష్ట్రాల్లోగానీ భాజపా విజయానికి కారణం… ప్రత్యర్థుల బలహీనత! ఇదే భాజపాకి బలమైంది. అన్నిటికీ మించి గత నవంబర్‌లో మోడీ సర్కారు తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం..! భాజపా వ్యూహాత్మక విజయానికి ఇదే కారణం.
నోట్ల రద్దు నిర్ణయానికి ముందే భాజపా నాయకులకు లీకులున్నాయనీ, జాగ్రత్త పడ్డారని అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. నవంబర్ 8 తరువాత కరెన్సీ లావాదేవీలపై రకరకాల పరిమితులు వచ్చేశాయి. రాజకీయ పార్టీల ఫండింగ్పై కూడా కొత్తకొత్త ఆంక్షలు వచ్చేశాయి. అయితే, ఇవన్నీ భాజపా జాగ్రత్త పడ్డాక తీసుకొచ్చిన ఆంక్షలుగానే చాలామంది భావించారు. దీంతో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌గానీ, ఎస్పీగానీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎన్నికల సమయంలో సొమ్ము అవసరం అనేది నగ్న సత్యం. ఎన్నికల్లో సొమ్ము ఏరులైపారడం అత్యంత సహజమైన విషయంగా మారిపోయిన ప్రజాస్వామ్య దేశం మనది! నోట్ల రద్దుతో యూపీలో ప్రధాన పార్టీల దగ్గర సొమ్ము లేకుండా పోయింది..! ఉన్న పాతనోట్లను ఆయా పార్టీలు రకరకాల మార్గాల్లో మార్చుకున్నా… ఆశించిన స్థాయిలో నిధుల సమీకరణ చేయలేకపోయాయి. ఇతర రాజకీయ పార్టీలకు అలాంటి ఒక సంకట స్థితిని భాజపా సృష్టించింది.
ఇదే సమయంలో.. దేశవ్యాప్తంగా ప్రజలు సొమ్ము కోసం నానా కష్టాలు పడ్డారు. ఎన్నికలు జరగబోతున్న ఈ రాష్ట్రాల్లోనూ ప్రజలు భాజపాని తిట్టుకున్నారు. అయితే, రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని ఒక కమిటీ ఈ రాష్ట్రాల్లో పర్యటించి, పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై సామాన్యుడు ఆగ్రహంగా ఉన్నాడనీ… ఏదో ఒకటి చేయకపోతే ఎన్నికల్లో ఇబ్బందిగా మారేట్టుగా ఉందనీ నివేదించిందిట. దీంతో ఆర్బీఐ దగ్గర ముద్ర అవుతున్న కొత్త నోట్లలో అధిక శాతం కరెన్సీని ఈ రాష్ట్రాలకు మళ్లించి… నగదు కొరతను త్వరగా తగ్గించడంలో భాజపా సక్సెస్ అయింది. దీంతో మోడీ సర్కారు ఏదో చేస్తోందన్న విశ్వాసం వారిలో కల్పించడంలో అమిత్ షా, మోడీ సాబ్ ఎత్తుగడలు ఫలించాయి.
సో… ఇలా పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని రెండు రకాలుగా వాడుకుంది భాజపా! ఇతర పార్టీలను ఆర్థికంగా దెబ్బకొట్టింది. సరిగ్గా ఎన్నికల సమయం వచ్చేసరికి పార్టీల వద్ద ఉన్న నోట్ల కట్టల్ని చిత్తు కాగితాలు చేసింది. ఎట్ ద సేమ్ టైమ్… భాజపా నాయకులు ఎంత ముందు జాగ్రత్త పడ్డారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఒక భాజపా ఎమ్మెల్యే దగ్గర కొన్ని వేల కోట్లు కొత్త నోట్లు దొరికితే… ఒక రోజు వార్తల్లో మాత్రమే ఆ పెద్ద మనిషి పేరు వినిపించింది! ఆ తరువాత, ఆయన భాజపా సానుభూతి పరుడని తేలడంతో తరువాత చట్టం కూడా తన పని తాను చేసుకుంటూ పోయింది. పెద్ద నోట్ల రద్దు ఆటలో ఇదో ఉదాహరణ మాత్రమే.
మొత్తానికి, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఇలా విజయం సాధించింది. అందరూ అనుకున్నట్టు అవినీతి అంతం, ఉగ్రవాద సంస్థల కోరలుపీకడం, నల్లధనం వెలికి తీ, గరీబ్ కల్యాణ్, పేదల భవిష్యత్తు బంగారం, గాడిద గుడ్డూ ఇవేవీ కాదు! ఎన్నికల్లో భాజపా విజయం సాధించడానికి మాత్రమే ఆ నిర్ణయం ఉపయోగపడింది. సో… ఇది కూడా ప్రజలు సాధించిన విజయంగా అభివర్ణించేద్దాం..! ఎలాగూ రేపట్నుంచీ వెంకయ్య నాయుడు లాంటివాళ్లు చెప్పబోయేది ఇదే కదా!