గుజరాత్ ముఖ్యమంత్రిగా సాధించిన విజయాలే సోపానంగా నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయ్యారు. గత 18 నెలలుగా మోడీ పాలనను గమనించిన వారిలో మెచ్చుకునే వారికంటే విమర్శించే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇంత పెద్ద దేశంలో భారీ మార్పులు తేవడానికి ఏడాదిన్నర చాలా తక్కువ సమయం. అయినా సరే, మోడీ మీద గంపెడాశలు పెట్టుకున్న ప్రజలు, ఇన్ స్టంట్ మార్పులు ఆశించారు. అది కనిపించకపోయేసరికి నిరాశ పడ్డారు. తాజాగా బీహార్ ఫలితాలు అదే విషయాన్ని సూచిస్తున్నాయి.
విదేశాల్లోని నల్లధనం ఇంకా వెనక్కి రాలేదు. లక్షలాది ఉద్యోగాలు ఇంకా యువత దరిచేరలేదు. మేకిన్ ఇండియా ప్రయత్నాలు మొదలైనా ఇంకా పరిశ్రమల స్థాపన ఊపందుకోలేదు. ధరల పెరుగుదలకు కళ్లెం పడలేదు. మొన్నటి దాకా ఉల్లిగడ్డలు, ఇప్పుడు పప్పుల ధరలకు ప్రజలకు కొరుకుడు పడటం లేదు.
మోడీ విదేశీ పర్యటనలకు మరీ ఎక్కువయ్యాయయనే విమర్శలు పెరగుతున్నాయి. ఇప్పటి వరకూ ఆయన 29 దేశాల్లో పర్యటించారు. మళ్లీ యూకే పర్యటనకు వెళ్తున్నారు. ఓ వైపు ధరల భారం, మరో వైపు ద్రవ్యోల్బణ ప్రభావం ప్రజలకు సంకటంగా మారాయి. పారిశ్రామిక వృద్ధి మందగించింది. ప్రజలకు కావాల్సిందానికి బదులు, బీజేపీ నేతలు ఏవేవో విషయాలపై మాట్లాడుతుంటారు. బీఫ్ వివాదం, దానిపై సంఘ్ పరివార్ నేతల వ్యాఖ్యలు ప్రజలకు కోపం తెప్పించాయి. సొంత పార్టీ నేతలను కట్టడి చేయలేకపోవడం మోడీ వైఫల్యం. కేంద్ర మంత్రులు కూడా తోచిన విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నా ప్రధాని ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
మోడీ ప్రధాని అయిన తర్వాత మార్పు మొదలైంది. అయితే అది చాలదు. మన దేశంలో ప్రత్యక్షంగా తాయిలాలతో ప్రజలను బుట్టలో వేసుకోవడం చాలా కాలంగా ఉన్న ఆనవాయితీ. ప్రలు కూడా తమకు ప్రత్యక్షంగా లబ్ధి కలిగిస్తేనే మార్పు వచ్చిందని నమ్ముతారు. స్వచ్ఛ భారత్ వల్ల మొదలైన మార్పును గుర్తించే పరిస్థితి రావడానికి చాలా సమయం పడుతుంది. ప్రపంచానికి భారత్ పై పెరిగిన నమ్మకం విలువ ప్రజలకు అర్థం కావడానికి ఇంకా సమయం పడుతుంది. ముందు, ధరల పెరుగుదలను అరికట్టడం, విదేశీ పర్యటనలను తగ్గించుకోవడం, నల్లధనాన్ని వెనక్కి రప్పించడానికి వేగంగా పనిచేయడం, మార్పు ప్రస్ఫుటంగా కనిపించేలా ప్రణాళికలు అమలు చేయడం.. ఇవీ మోడీ చేయాల్సిన పనులు. దేశంలో మరే నాయకుడిమీదా పెట్టుకోనన్ని ఆశలు మోడీ మీద పెట్టుకున్నారు ప్రజలు. వాటిని అడియాస చేయకూడదు. బీహార్ ఎన్నికల ఫలితాల పాఠం కూడా అదే.
మోడీలో సత్తా ఉంది. గుజరాత్ ను నెంబర్ వన్ రాష్ట్రంగా మలచిన మోడీ, భారత్ ను నెంబర్ వన్ దేశంగా అభివృద్ధి చేయడానికి మాటలకు బదులు చేతలతో ప్రయత్నిస్తే మంచి మార్పు తప్పకుండా వస్తుంది. అది ఆయన పార్టీకే కాదు, దేశానికి కూడా మేలు చేస్తుంది.