భారతీయ జనతా పార్టీకి స్టార్ కేంపెయినర్ ఎవరున్నారు… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తప్ప! భాజపాలో ఆయనకి సమానమైన స్థాయి నేత లేరు! ఇలా అనే కంటే… అలాంటి నేతల్ని లేకుండా చేసుకున్నారని చెప్పొచ్చు. ఉన్న సీనియర్లకు గౌరవం తగ్గించేసి, దశలవారీగా ఒక్కొక్కరినీ జాగ్రత్తగా పక్కనపెట్టేశారు. భాజపా అంటే మోడీ, మోడీ అంటే భాజపా అన్నట్టు మాత్రమే మొత్తంగా పార్టీపై పట్టు సాధించారు. దీంతో.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో భారీ ఎత్తున పార్టీ తరఫున ప్రచారం చేయాల్సిన బాధ్యత కేవలం నరేంద్ర మోడీపై మాత్రమే ఉంటుంది. ఇప్పటికే భాజపా ఎన్నికల మూడ్ కి వచ్చేసింది. రాష్ట్రాల్లో మిత్రులు, పొత్తులు అంటూ వ్యూహ ప్రతివ్యూహాలతో ఉంది. అయితే… 2014 ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి అదే స్థాయిలో మోడీ ప్రచారం చేయగలడం అనుమానంగానే ఉందనే కథనాలు వినిపిస్తున్నాయి.
2014 ఎన్నికలకు ముందు మోడీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందు దాదాపు 5 వేల బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. పాతిక రాష్ట్రాల్లో దాదాపు వేలకుపైగా కిలోమీటర్లు పర్యటనలు చేశారు. కానీ, ప్రస్తుతం అంత వెసులుబాటు మోడీకి ఉండటం లేదు. అప్పట్లో అంటే ఆయన ప్రధాని అభ్యర్థి మాత్రమే కాబట్టి… ఎన్ని సభలు పెట్టుకున్నా వెళ్లిపోయేవారు. కానీ, ఇప్పుడు ప్రధాని కదా… గతంలో మాదిరిగా సభలకే ప్రాధాన్యత ఇస్తే ఎలా..? అందుకే, ఈసారి పార్టీ ప్రచార బాధ్యతల్ని కొంతమంది కీలక నేతలకు పంచాలని భావిస్తున్నారట. ఎలాగూ ముందస్తు ఎన్నికలు ఉండవనేది దాదాపు తేలిపోతోంది. దేశవ్యాప్తంగా భాజపా మీద వ్యక్తమౌతున్న వ్యతిరేకత నేపథ్యంలో ముందస్తుగా వెళ్లే ధైర్యం ఆ పార్టీకి ఉండదు. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని, వ్యతిరేకతను తగ్గించుకోవడంపైనే దృష్టి పెడతారన్నది తెలిసిందే.
దీంతో ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా 200 భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని భాజపా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సభలకు అగ్రనేతలు వస్తారు. భాజపా అధ్యక్షుడు అమిత్ షా దేశంలో ఓ యాభై భారీ ర్యాలీలు నిర్వహిస్తారని సమాచారం. రాజ్ నాథ్ సింగ్ కి కూడా మరో యాభై సభల బాధ్యతలు అప్పగిస్తారనీ సమాచారం. ఇక, మోడీ విషయానికొస్తే.. ఆయన కొద్ది సభల్లో మాత్రమే పాల్గొంటారనీ, అది కూడా ఉత్తారాదిలో పార్టీ ప్రచారంపైనే ఆయన ప్రత్యేక దృష్టి పెడతారని తెలుస్తోంది. దక్షిణాదితోపాటు ఇతర రాష్ట్రాల ప్రచారాల్లో అమిత్ షా ప్రముఖంగా కనిపించే అవకాశం ఉంది. అయితే, మోడీ వస్తేనే సభలకు ఊపు వస్తుందనే అభిప్రాయం భాజపా శ్రేణుల్లో బలంగా ఉంది. కానీ, ప్రస్తుతం ఆయన గతంలో మాదిరిగా తిరిగే పరిస్థితి కనిపించడం లేదు.