మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీజేపీ ఉత్తరాది రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇస్తోందని, దక్షిణాది రాష్ట్రాలను విస్మరిస్తోందని విమర్శలున్నాయి. బడ్జెట్ కేటాయింపులు , కేంద్ర మంత్రివర్గ శాఖలు.. ఇలా ఎలా చూసినా నార్త్ కే మోడీ ప్రియార్టి ఇచ్చారని స్పష్టం అవుతోంది. కానీ, ఎన్నికలు వచ్చే సరికి మాత్రం దక్షిణాదిపై ప్రేమను వ్యక్తం చేస్తుంటారని ఆ పార్టీపై ఆరోపణలు ఉన్నాయి.
దక్షిణాదిపై మోడీ వివక్ష కారణంగా భవిష్యత్ లో మాకు సెపరేట్ దేశం కావాలని దక్షిణాది ప్రజలు డిమాండ్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. విమానాశ్రయాలు, రైల్వేలు, వంతెనలు నార్త్ తో పోలిస్తే దక్షిణాదిపై బీజేపీ నేతృత్వంలోని మోడీ సర్కార్ వివక్ష చూపినట్లు స్పష్టం అవుతుందని బాహాటంగానే విమర్శలు వస్తున్నాయి. ముంబై- బరోడా రైలు కోసం ఐదు లక్షల కోట్లను కేటాయించారు. మోడీ సొంత రాష్ట్రానికి అధిక నిధులు వెచ్చిస్తూ దక్షిణాది రాష్ట్రాలకు మాత్రం మొండి చేయి చూపుతున్నారని సౌత్ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మోడీ వైఖరి నార్త్ కు మాత్రమే పీఎం అనే తరహాలో ఉందని సెటైర్లు వేస్తున్నారు. మోడీ చెప్తున్న వికసిత్ భారత్ కాస్త విభజిత్ భారత్ లా మారిందని ఎద్దేవా చేస్తున్నారు. ఈసారి నార్త్ నుంచి బీజేపీకి ఎదురుదాలి వీస్తుండటంతో బీజేపీ అగ్రనేతలు దక్షిణాదిపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. దక్షిణాదిలో 131సీట్లను గెలిస్తే కానీ బీజేపీ చెప్తున్నట్లుగా 400సీట్ల లక్ష్యం నెరవేరదు. ఎంత ప్రయత్నించినా సౌత్ లో బీజేపీకి ఆదరణ లభించే సీన్ కనిపించడం లేదు.
మోడీ కేబినేట్ లో కీలక మంత్రిత్వ శాఖలన్నీ గుజరాత్, యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ , వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన ఎంపీల వద్ద ఒక్క కీలక మంత్రిత్వ శాఖ కూడా లేదు. ఎటు చూసినా కేంద్రం సౌత్ పై వివక్ష చూపుతుందని స్పష్టం అవుతుందని విమర్శలు చెలరేగుతున్నాయి.