తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను…ప్రధాని నరేంద్రమోడీ.. లోక్‌సభలో… ఓ రేంజ్లో ప్రశంసించారు. ఈ ప్రశంసల కారణం…టీఆర్ఎస్ ఓటింగ్‌లో పాల్గొనలేదన్న సంగతిని ఎవరూ గుర్తించలేకపోతున్నారు. టీఆర్ఎస్ బీజేపీకే మద్దతిచ్చిందని భావిస్తున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర సమితి అధినేతకు రెండు విధాలుగా టెన్షన్ పెడుతోందన్న ప్రచారం తెలంగాణ భవన్ వర్గాల్లో జరుగుతోంది. ఒకటి.. ముస్లిం ఓట్లు కాంగ్రెస్ వైపు పొలరైజ్ కావడం.. రెండు తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడ్డారనే భావన ప్రజల్లోకి వెళ్లడం.
తెలంగాణలో ఎంఐఎంతో..కేసీఆర్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. సాధారణంగా తమకు మేలు చేసే ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఎంఐఎం సన్నిహితంగానే ఉంటుంది. నేరుగా ఎప్పుడూ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోదు. కానీ ఎంఐఎం..బీజేపీపై అవిశ్వాస తీర్మానానికి బేషరతుగా మద్దతిచ్చింది. టీఆర్ఎస్ మాత్రం దాదాపుగా సపోర్ట్ చేసినట్లుగా మాట్లాడింది. ముస్లిం రిజర్వేషన్ల కోసం.. ప్రధానితో భేటీ సమయంలోనూ..మాట్లాడలేదు. పార్లమెంట్లో కూడా ప్రస్తావించలేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ.. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది.
ఇక బీజేపీతో ప్రశంసలు పొందడానికి రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడ్డారనే ప్రచారం.. ఇతర వర్గాల్లో సాగుతోంది. ముఖ్యంగా.. ఉద్యమకారుల్లో ఈ అభిప్రాయం పెరిగిపోతోంది. ఏపీలో ప్రభుత్వం కొట్లాడుతూ కూడా.. ఎంతో కొంత నిధులు తెచ్చుకుంటూ ఉంటే.. తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా..కేసీఆర్ నోరు మెదపడం లేదన్న భావన పెరిగిపోతోంది. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కేంద్రం ఇవ్వకపోతే..మేమే కట్టుకుంటాం… అన్న కేసీఆర్ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తమవుతోంది. టీజేఎస్ అధినేత కోదండరాం.. దీన్నే హైలెట్ చేసి చాపకింద నీరులా ప్రచారం చేస్తున్నారు. ఇది ఒక్కటే.. ఈ నాలుగేళ్ల కాలంలో.. కేంద్రం నుంచి విభజన చట్టం ప్రకారం.. కానీ. .. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, ప్రాజెక్టుల రీ డిజైన్ కు కానీ కేంద్రం ఒక్క రూపాయి విదిలించలేదు. వీటికి నిధులివ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా పట్టించుకోలేదు.
ఏపీ నిధులు అడుగుతోంది.. తెలంగాణ అడగడం లేదు కాబట్టే… కేసీఆర్‌ను మోడీ పొగిడినట్లుగా.. ప్రజల్లోకి వెళ్తోంది. ఇది అర్థమైన కేసీఆర్ ఆదివారం అని చూసుకోకుడా.. వెళ్లి గవర్నర్‌ను కలిశారు. సాయం చేయాల్సిందేనన్న డిమాండ్ లాంటి విజ్ఞప్తిని కేంద్రానికి వయా గవర్నర్ ద్వారా చేసి వచ్చారు. ఈ హడావుడి మరికొంత కాలం ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాతైనా కేసీఆర్‌కి మోడీ పొగడ్తలే ఇస్తారా.. కాసిని నిధులేమైనా కనికరిస్తారా అన్నది సస్పెన్స్ ధ్రిల్లరే.