డిల్లీ, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కుంభకోణంలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తన పదవికి రాజీనామా చేయకతప్పని పరిస్థితి కనబడుతోంది. ఆయనపై డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలు మూకుమ్మడిగా దాడి చేస్తూ ఆయన రాజీనామాకు పట్టుబడుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోడి ఆయనకు అండగా నిలబడ్డారు. కానీ ఆయన మాట్లాడిన మాటలు మాత్రం వేరే అర్ధం స్పురింపజేసాయి. “ఇంతకు ముందు హవాలా కేసులో లాల్ కృష్ణ అద్వానీపై కూడా ఇలాగే ఆరోపణలు వచ్చేయి. అప్పుడు ఆయన వాటిని దైర్యంగా ఎదుర్కొని న్యాయస్థానంలో తన నిజాయితీని, నిర్దోషిత్వాన్ని నిరూపించుకొన్నారు. అదేవిధంగా ఇప్పుడు అరుణ్ జైట్లీ కూడా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని బయటపడతారు,” అని ప్రధాని మోడీ అన్నారు.
ఈమాట ప్రధాని నరేంద్ర మోడి ఏదో యాదృచ్చికంగా అనలేదు. లోక్ సభలో అరుణ్ జైట్లీకి అండగా నిలబడి మాట్లాడుతూ అన్నారు. అయితే అందులో ఆయన బయటకి ప్రస్తావించని ఒక విషయం ఉంది. అదే లాల్ కృష్ణ అద్వానీ తన పదవికి రాజీనామా చేయడం. అద్వానీ తన పదవికి రాజీనామా చేసి కోర్టులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొన్నారు. అంటే ఇప్పుడు అరుణ్ జైట్లీని కూడా తన పదవికి రాజీనామా చేయమని నరేంద్ర మోడీ సూచిస్తున్నట్లుగా ఉంది. ఆ మాట పట్టుకొని ఇప్పుడు ప్రతిపక్షాలు అరుణ్ జైట్లీ రాజీనామా కోసం గట్టిగా పట్టుబడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడియే రాజీనామా చేయమని చెపుతున్నా కూడా ఇంకా ఎందుకు ఆ పదవిలో కొనసాగుతున్నారని సిపిఐ (ఎం) జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారి ప్రశ్నిస్తున్నారు.