ప్రధాని నరేంద్రమోడీ హిందూ ధర్మం ప్రకారం , అగ్నిసాక్షిగా ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే కాలక్రమంలో అరెస్సెస్ ప్రభావంలో ఒంటరి జీవితాన్ని ఇష్టపడి ఆమెను తృణీకరించాడు. ఆమె కూడా తన జీవితాన్ని తానే నిర్మించుకుంది. భర్త తృణీకరించాడు గనుక.. కుంగిపోలేదు. టీచరుగా ఉద్యోగం సంపాదించుకుని తన బతుకేదో తను బతుకుతోంది. ఇప్పుడు సర్వీసునుంచి కూడా రిటైర్ అయి ఉంటున్నది. అయితే సాంకేతికంగా నరేంద్రమోడీ ఈ వివాహ బంధాన్ని ‘తెంచేసుకోలేదు’. ఆయన ఇష్టాన్ని గౌరవిస్తూ వచ్చిన ఆమె కూడా దాని గురించి పట్టించుకోలేదు.
అయితే ఇప్పుడు ఆమెతో ‘రిలేషన్’ను మోడీ ఎలా భావిస్తున్నారు. ఎలా క్లెయిం చేసుకుంటున్నారు? తనకు భార్య ఉందంటున్నారా? లేదంటున్నారా? తాను ‘అన్ మారీడ్’ అని క్లెయిం చేసుకుంటున్నారా? ఇలాంటి సవాలక్ష సందేహాలకు ఫుల్స్టాప్ పెట్టే పనిని ఆమె స్వయంగా భుజానికెత్తుకున్నారు. మోడీ పాస్‌పోర్టు కాపీని తనకు ఇవ్వాలంటూ సంబంధిత కార్యాలయానికి మోడీ శ్రీమతి జశోదా బెన్ సమాచార హక్కు ద్వారా దరఖాస్తు చేశారు. ఈ పితలాటకం అంతా కేవలం అధికార్ల నిర్లక్ష్యం వల్ల వచ్చింది.
విదేశాల్లో ఉన్న బంధువులు, మిత్రులను కలవడానికి వెళ్లాలని జశోదా బెన్ ఎప్పటినుంచో అనుకుంటున్నారు. అందుకోసం ఆమె పాస్‌పోర్టుకు దరఖాస్తు చేస్తే మారేజి సర్టిఫికెట్ లేదంటూ అధికారులు తిరస్కరించారు. ఎన్నడో నలభైఏళ్లకిందట పెళ్లయిన వృద్ధమహిళకు ఇప్పుడు సర్టిఫికెట్ ఎక్కడినుంచి వస్తుంది? తనకు పాస్‌పోర్టు ఇవ్వడానికి మ్యారేజి సర్టిఫికెట్ లేదని నిరాకరించిన వారు, తన భర్త మోడీకి ఎలా ఇచ్చారో తెలుసుకోవాలని ఆమె ఆర్టీఐను ఆశ్రయించింది. ఇంతకూ అసలు తన భర్త, పాస్‌పోర్టులో మ్యారీడ్ అని ఉందా? అన్‌మ్యారీడ్ అని ఉందా? మ్యారీడ్ అని ఉంటే.. ఆయన మ్యారేజి సర్టిఫికెట్ ఎలా ఇచ్చారో తెలుసుకోవాలని ఆమె అనుకుంటున్నది.
నిజానికి జశోదా బెన్ సందేహం.. సంధించిన సమాచార హక్కు అస్త్రం రెండూ సమంజసంగానే ఉన్నాయి. అయితే.. వీటిద్వారా ఆమెతో రిలేషన్ గురించి మోడీ గుట్టు రట్టు అవుతుందని మాత్రం అంతా అనుకుంటున్నారు.