గుంటూరు పశ్చిమ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ప్రతిపక్ష పార్టీ వైకాపాలో ఆయన చేరబోతున్నట్టు చెప్పారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా పత్రాన్ని కూడా ఆయన అందజేశారు. ఈ సందర్భంగా అనుచరులతో ఆయన చర్చించి, పార్టీ మార్పు నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే, మోదుగుల పార్టీని వీడుతుండటం టీడీపీకి తగిలిన మరో షాక్ అనీ, టీడీపీపై ప్రజల్లో వ్యక్తమౌతున్న వ్యతిరేకత నేపథ్యంలో ఆయన పార్టీని వీడారనీ, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేస్తోంది కాబట్టి, నాయకులు తమవైపు వస్తున్నారంటూ వైకాపా మీడియా కథనాలు గుప్పిస్తోంది. అయితే, మోదుగుల పార్టీ మార్పు ఏమంత అనూహ్యమైంది కాదనేది వాస్తవం.
2009లో మోదుగుల టీడీపీలో చేరారు. వెంటనే ఆయనకి నర్సరావుపేట ఎంపీ టిక్కెట్ పార్టీ ఇచ్చింది. మంచి మెజారిటీతో గెలిచారు. 2014 ఎన్నికల్లో కూడా మరోసారి ఎంపీ సీటు కోసం ఆయన ప్రయత్నించినా… టీడీపీ అధినాయకత్వం ఇవ్వలేదు. గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యే సీటు పార్టీ ఇచ్చింది, గెలిచారు. అయితే, ఆయన అప్పట్నుంచీ మంత్రి పదవి ఆశిస్తూ వస్తున్నారు. దాంతో ఆయన పార్టీ అధినాయకత్వం మీద కొంత అసంతృప్తి ధోరణి పెంచుకున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారికి మంత్రి పదవులు ఇస్తున్న సమయంలో కూడా తనని పరిగణనలోకి తీసుకోలేదనే భావనతో ఉండేవారట. దీంతో స్థానికంగా కూడా పార్టీ వర్గాల్లో కొన్ని సమస్యల కారణంగా అధినాయకత్వంతో కొంత గ్యాప్ అయితే పెరిగింది. వచ్చే ఎన్నికల్లో ఆయనకి టీడీపీ నుంచి సీటు దక్కడం అనుమానమే అనే ప్రచారం ఎప్పట్నుంచో ఉంది. కాబట్టి, ఆయన పార్టీ మారుతుండటం ఏమంత హఠాత్ పరిణామం కాదు.
టీడీపీని వీడుతున్న సమయంలో కూడా తనకు పార్టీ చాలా అవకాశాలు ఇచ్చిందనీ, కొన్ని అవమానాలు ఎదురయ్యాయంటూ పార్టీని వీడుతున్నది వ్యక్తిగత కారణాల నేపథ్యాన్నే చెప్పారు. మోదుగుల వైకాపాలో చేరినా, గుంటూరు ఎంపీ సీటు దక్కడం కూడా కొంత అనుమానంగానే ఉంది. కిలారు రోశయ్య ఇప్పటికే వైకాపా నుంచి అక్కడ బరిలో ఉన్నారు. నర్సరావు పేటలో లావు కృష్ణదేవరాయలు వైకాపా నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారు. గుంటూరు, నర్సరావుపేట… ఈ రెండు సీట్లలో మోదుగులకు ఏదీ దక్కదనే వాతావరణమే ప్రస్తుతానికి ఉంది. ఏదేమైనా, ఆయన టీడీపీని వీడటం వెనక కొంత స్వయంకృతం కూడా ఉందనే అభిప్రాయమూ స్థానికంగా ఉంది. ఒక సామాజిక వర్గానికే టీడీపీలో ప్రాధాన్యత ఉంటుందనే అభిప్రాయంతో మోదుగుల ఉండటం, వైకాపా నేతలతో తరచూ టచ్ ఉంటారనే అభిప్రాయమూ ఉందనే కథనాలూ ఉన్నాయి. కాబట్టి, ఆయన పార్టీ మార్పు ఎప్పుడో ఊహించిందే అని టీడీపీ వర్గాలు అంటున్నాయి.