టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ పార్టీ నేత అజహరుద్దీన్.. ఈ సారి సికింద్రాద్ సీటు మీద కన్నేశారు. క్రికెటర్‌గా ఆయనకు ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకున్న కాంగ్రెస్ పార్టీ గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లో ఓ సారి ఉత్తరప్రదేశ్ నుంచి మరోసారి రాజస్థాన్‌ను పోటీకి నిలిపింది. ఉత్తరప్రదేశ్‌ను నుంచి గెలుపొందినా.. రాజస్థాన్ నుంచి మాత్రం పరాజయం పాలు కావాల్సి వచ్చింది. ఎన్నికలు దగ్గరకు వస్తూండటంతో ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నదానిపై ఆయన కసరత్తు చేసుకుంటున్నారు. ఆయనకు సికింద్రాబాద్ అయితే.. ఎన్నికల్లో సిక్సర్ కొట్టొచ్చనే ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా బయటపెట్టేశారు. కానీ కాంగ్రెస్ అంటే .. అదీ కూడా.. తెలంగాణ కాంగ్రెస్ అంటే ఎలా ఉంటుందో తెలియదుగా.. ! వెంటనే తెలిసేలా చేశారు.. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్.
సికింద్రాబాద్ ఎంపీగా రెండు సార్లు గెలిచిన అంజన్ కుమార్ యాదవ్.. వచ్చే ఎన్నికల్లో సీటు తనదేనంటున్నారు. గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో తనదైన స్టైల్లో రచ్చ రచ్చ చేశారు. నిజానికి గత 2014 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి అజహరుద్దీన్ పేరు వినిపించింది. కానీ చివరి క్షణంలో… రాజస్థాన్ వెళ్లిపోయారు. ఈ సారి మాత్రం.. అజహర్ సొంత రాష్ట్రం నుంచే పోటీ చేయాలనుకుంటున్నారు. దానికి సికింద్రాబాద్ అయితేనే కరెక్టనుకుంటున్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరిన కిరణ్‌కుమార్ రెడ్డి… ఈ విషయంలో సలహా ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అజహరుద్దీన్ బాగా గౌరవించే వ్యక్తుల్లో కిరణ్ ఒకరు. కాలేజీ స్థాయిలో కిరణ్ కెప్టెన్సీలో.. అజహరుద్దీన్ క్రికెట్ ఆడారు. అప్పట్నుంచి ఆ స్నేహం కొనసాగుతోంది.
అంజన్ కుమార్ యాదవ్ రెండు సార్లు..ఎంపీ అయినప్పటికీ ఆయనకు రెండు సార్లు లక్ అలా కలసి వచ్చింది. 2004లో అంజన్ కుమార్ యాదవ్ కనీసం అసెంబ్లీ టిక్కెట్ రేసులో కూడా లేరు. ఆ సమయంలో వైఎస్ ప్రాబల్యం మరీ అంత ఎక్కువగా ఉండేది కాదు. అసిఫ్ నగర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్‌కు టిక్కెట్ నిరాకరించారు. దానంకు సికింద్రాబాద్ లోక్‌సభ టిక్కెట్‌ను ఖరారు చేశారు. అప్పుడు .. ఏం చేసినా సరే.. సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ గెలిచే చాన్సే లేదన్న అభిప్రాయం ఉండేది. అందుకే దానం.. పోటీ చేయడానికి నిరాకరించి టీడీపీలో చేరిపోయారు. అసిఫ్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. చివరిగా అక్కడ పోటీ చేయడానికి ఎవరూ లేకపోతే.. అప్పట్లో హైదరాబాద్ సిటీ అధ్యక్షుడిగా ఉండే అంజన్ కుమార్ యాదవ్ ని నిలబెట్టారు. అనూహ్యంగా గెలుపొందారు. 2009లోనూ యూపీఏ హవా వీయడంతో గెలుపొందారు. గత ఎన్నికల్లో ఓడిపోయారు.
టిక్కెట్ విషయంలో అంజన్, అజహర్ పక్క పక్కన పెడితే.. అజరహుద్దీన్కే హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అజహర్‌కు హైకమాండ్ దగ్గర పలుకుబడితో పాటు.. తెలంగాణలో ముస్లింల సపోర్ట్ కూడా ఉంటుందని కాంగ్రెస్ నమ్ముతోంది.