మా సినిమాలో గొప్ప కథ ఉంది, కామెడీ ఉంది, ఇరగదీసే ఫైట్లున్నాయి.. అని చెప్పుకునే రోజులు పోయాయి. ‘మా సినిమాలో ముద్దులున్నాయ్…’ అని చెప్పుకునే స్థితికి వచ్చేశాం. ఈ శుక్రవారం విడుదలైన `డీజే టిల్లు`కి ముద్దులతోనే… బోలెడంత పబ్లిసిటీ వచ్చింది. ముద్దులతోనే ప్రమోషన్లు జరిగాయి. ఇప్పుడు మోహన్ బాబు సైతం..’మా సినిమాలో ముద్దు సీన్లు ఉన్నాయ్’ అని ప్రేక్షకుల్ని ఊరించే పనిలో పడిపోవడం విడ్డూరంగా కనిపిస్తోంది.
ఈరోజు సన్నాఫ్ ఇండియాకి సంబంధించిన మీడియా ఇంటర్వ్యూలు జరిగాయి. ముద్దు గురించి ఎవరూ, అడక్కుండానే.. ‘మా సినిమాలో ముద్దులు కూడా ఉన్నాయి.. అవి మామూలు ముద్దులు కాదు. ఆడ – ఆడ పెట్టుకునే ముద్దులు… ‘ అంటూ సెలవిచ్చారు కలక్షన్ కింగ్. నిజానికి ఇది ఓటీటీ కోసం తీసిన సినిమా అట. ఓటీటీ ట్రెండ్ ని దృష్టిలో ఉంచుకుని, ఆ సీన్లు తీశార్ట. ఇప్పుడు సినిమా థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ ముద్దు సీన్లలో కొన్ని థియేటర్ ఆడియన్స్ కోసం తొలగించార్ట. ఓటీటీలో విడుదలైతే మాత్రం తీసిన ముద్దులన్నీ చూపించేవార్ట. ఈ సినిమా నిడివి కేవలం 80 నిమిషాలే. మరి ట్రిమ్మింగ్లో సినిమా లేచిపోయిందో, లేదంటే.. అంతే చాలనుకున్నారో తెలీదు గానీ గంటా ఇరవై నిమిషాల్లో సినిమా అయిపోతుంది. ఈనెల 18న ‘సన్నాఫ్ ఇండియా’ రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి డైమండ్ రత్న బాబు దర్శకుడు.