మీడియాపై ఇష్టారీతిన దాడులు చేసిన మోహన్ బాబు అరెస్టు భయంతో ఆస్పత్రిలో చేరిపోయారు. భార్యతో సహా ఆయన కాంటినెంటర్ ఆస్పత్రిలో చేరారు. తన తండ్రికి బీపీ పెరిగిందని చెప్పి మంచు విష్ణు ఆస్పత్రిలో జాయిన్ చేశారు. మరో వైపు రాచకొండ పోలీసులు మోహన్ బాబుకు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన బుధవారం ఉదయం పదొకండు గంటలకు తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. మరో వైపు మంచు మోహన్ బాబు అరెస్టు భయంతోనే బీపీ పెరిగిందని చెప్పి ఆస్పత్రిలో చేరారన్న ఆరోపణలు వస్తున్నాయి.
మోహన్ బాబు కుమారుడు మనోజ్ విషయంలో కంట్రోల్ తప్పిపోయారు. ఆయనతో చర్చించి ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన ఆయన న్యూస్ ను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. అది కూడా చంపాలన్నంత కసితో దాడి చేయడంతో రెండు టీవీ చానళ్ల ప్రతినిధులకు తీవ్ర గాయాలయ్యాయి. హత్యాయత్నం కేసులు నమోదు చేసేంత తీవ్రమైన దాడి కావడంతో మోహన్ బాబు అరెస్టు నుంచి తప్పించుకోవడం కష్టమన్న వాదన వినిపిస్తోంది.
మరో వైపు మనోజ్ పైనా దాడి చేశారు. ఆయనపై బౌన్సర్లు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన తన కుమార్తె కోసం లోపలికి వెళ్లారు. అక్కడ మోహన్ బాబు నియమించిన బౌన్సర్లు కొట్టి పంపించారు.గుట్టుగా ఉంచుకోవాలన్సిన ఇంటి గుట్టును రోడ్డున పడేసుకున్న మోహన్ బాబు మీడియాపై దాడి చేసి మీడియా సానుభూతిని కూడా కోల్పోయారు.